నడిరోడ్డుపై నటుడి వీరంగం….. చితకబాదిన జనం

కన్నడ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ హుచ్చ వెంకట్ ను నడిరోడ్డుపై జనం చావబాదారు. అనవసరంగా ఒక వ్యక్తితో వాగ్విదానికి దిగి అతడి కారును ధ్వంసం చేయటంతో ఆగ్రహించిన జనం వెంకట్ ని చితక్కొట్టారు. కర్ణాటకలోని కొడుగు జిల్లా నాపోక్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పలు కన్నడ సినిమాల్లో హీరోగాను, విలన్ గాను నటించిన హుచ్చా వెంకట్ శుక్రవారం ఆగస్టు 29,2019 న నాపోక్లు గ్రామంలో ఒక రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ… సెలబ్రిటీ వచ్చాడని అందరూ వెంకట్ ను చూస్తూ నిలబడ్డారు. అందరు అలా చూడటం నచ్చని వెంకట్ దిలీప్ అనే వ్యక్తి వైపు తిరిగి ఏంటి చూస్తున్నావని ప్రశ్నించాడు.
దిలీప్ “మీరు వెంకట్ కదా” అని అన్నాడు. వెంకట్ వింతగా ప్రవర్తిస్తూ…దిలీప్ చెంప చెళ్లుమనిపించాడు. అనుకోని ఘటనకు బిత్తర పోయిన దిలీప్ షాక్ కు గురయ్యాడు. అంతటితో ఆగని వెంకట్ అక్కడే పార్క్ చేసి ఉన్న దిలీప్ కారు అద్దాన్ని పగలకొట్టాడు. ఆతర్వాత రోడ్డుపై విచిత్రంగా ప్రవర్తించాడు. షాక్ నుంచి తేరుకున్నదిలీప్ నటుడు వెంకట్ ను కొట్టాడు. నడిరోడ్డుపై నటుడి వీరంగం చూసిన జనం దిలీప్ తో కలిపి నటుడ్ని చితక బాదారు. ఇంతలో కొందరు కలుగచేసుకుని వారిని ఆపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని వెంకట్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
గత వారం చెన్నై వీధుల్లోనూ వెంకట్ ఇలాగే న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఓ హోటల్ యాజమాన్యం రూమ్ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. కాళ్లకు చెప్పులు లేకుండా అతను చెన్నై వీధుల్లో తిరిగినట్టు ప్రచారం జరిగింది. కాగా, బిగ్‌బాస్ కన్నడ 3 షో ద్వారా వెంకట్ పాపులర్ అయ్యాడు. ‘హుచ్చ వెంకట్’,’తిక్ల’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించడమే గాక.. తానే హీరోగా నటించాడు. వెంకట్ వివాదాలతో వార్తల్లోకి ఎక్కడం ఇదే కొత్త కాదు. గతంలో దివ్య స్పందన అనే నటిని పెళ్లి పేరుతో వేధించినందుకు అతనిపై కేసు నమోదైంది. ఓ టెలివిజన్ డిబేట్‌లో ఒక డైరెక్టర్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు.