Man Kills 5 Of Family : మరదలిపై మోజు…కాదన్నందుకు కుటుంబం మొత్తం ఖతం

అక్రమ సంబంధాల మోజులో పడి బంగారం లాంటి కాపురాలను రోడ్డన పడేసుకునే వారు కొందరుంటే...ఆవేశంలో జీవితాలను అంతం చేసుకుంటున్నవారు మరికొందరు. మహారాష్ట్రలో ఇదే జరిగింది.

Man Kills 5 Of Family : మరదలిపై మోజు…కాదన్నందుకు కుటుంబం మొత్తం ఖతం

Man Kills 5 Of Family

Updated On : June 23, 2021 / 12:31 PM IST

Man Kills 5 Of Family :  అక్రమ సంబంధాల మోజులో పడి బంగారం లాంటి కాపురాలను రోడ్డన పడేసుకునే వారు కొందరుంటే…ఆవేశంలో జీవితాలను అంతం చేసుకుంటున్నవారు మరికొందరు. మహారాష్ట్రలో ఇదే జరిగింది. నాగపూర్‌లోని పచ్‌పవోలీలో టైలరింగ్ వ్యాపారం నిర్వహించే అలోక్ మతుకర్ ఆదివారం తన భార్య, పిల్లలు,అత్త,మరదల్ని హత్యచేసి తాను ఆత్మహత్య  చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరదలిపై కన్నేసిన మతుకర్ ఆమె తిరస్కరించే  సరికి కోపం పట్టలేక ఆవేశంలో హత్యలు చేసినట్లు తేలింది.

వివరాల్లోకి వెళితే .. అలోక్ మతుకర్ అనే వ్యక్తికి విజయ అనే మహిళతో వివాహం జరిగింది. వారికి పారి,సాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మతుకర్ మరదలు అమీషా కూడా టైలరింగ్ చేసేది. పెళ్లైన కొన్నాళ్లకు మరదలిపై కన్నేసిన మతుకర్ .. టైలరింగ్ పనిలో సహాయం చేసే నెపంతో మరదలితో అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు.

కొన్నిసార్లు లైంగిక దాడి కూడా చేశాడు. ఆమె ఎవరైనా మగ కస్టమర్లతో మాట్లాడితే కోపగించుకునే వాడు. తన ఎదుట ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడినా ఆమెతో గొడవకు దిగేవాడు. ఒకసారి తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడినందుకు అమీషాను కొట్టాడు.  అతని వేధింపులు ఇన్నాళ్లు భరించిన ఆమె తన బావపై సమీపంలోని పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. కుటుంబ వ్యవహారంగా చూసి పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశారు.

ఇది మనసులో పెట్టుకున్న మతుకర్ తన కుటుంబ సభ్యులను చంపటానికి ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో కత్తులు కొనుగోలు చేసాడు. అమీషా పోలీసులకు ఫిర్యాదు చేయటంపై ఆదివారం రాత్రి తన భార్య విజయ, అమీషాతో   గొడవ పడ్డాడు. గొడవ పెద్దదిగా మారటంతో  విచక్షణ కోల్పోయిన మతుకర్…అప్పటికే సిధ్దంగా ఉంచుకున్న  కత్తులతో భార్య విజయను, అత్త, మరదలిని విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. పిల్లలను బండతో మోది హత్య చేసాడు. అనంతరం ఉరేసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేసే  మామ ఉదయం వచ్చి చూసే సరికి కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.