అనుమానం పెనుభూతం : సహజీవనం చేస్తున్న మహిళ, అతని కుమారుడ్ని హత్య చేసిన ప్రియుడు

man eliminated paramour with her son : తనతో సహజీవనం చేస్తున్న మహిళ మరోక వ్యక్తితో చనువుగా ఉండటం సహించలేని వ్యక్తి, రెండేళ్ల బిడ్డతో సహా ఆమెను హత్యచేసిన ఘటన నిజామాబాద్ జిల్లా లో జరిగింది. జిల్లాలోని చందూర్ మండలం, హుమ్నాపూర్ కు చెందిన సుజాత(34) అదే గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తితో మూడేళ్లుగా సహజీవనం చేస్తోంది. సుజాతకు రాము(2) అనే కొడుకు ఉన్నాడు.
ఇటీవల సుజాత ప్రవర్తనపై రాములుకు అనుమానం కలిగింది. దీంతో ఆమెను…ఇతరులతో ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించాడు. నీకెందుకు అని ఆమె బదులిచ్చింది. ఈ సమాధానంతో రాములుకు, సుజాత ఇతరులతో సంబంధం పెట్టుకుందనే అనుమానం మరింత బలపడింది. సుజాతను ఆమె కొడుకును తుద ముట్టించాలని భావించాడు. ఆవిషయాన్ని బయటపడనీయకుండా ఆమెతో సఖ్యంగానే ఉండసాగాడు.
డిసెంబర్ 31వ తేదీన కట్టెలు తీసుకువద్దామని చెప్పి సుజాత ఆమె కొడుకును సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్లాడు. పధకం ప్రకారం తల్లీ, కొడుకులిద్దరినీ హత్య చేశాడు. మృతదేహాలను ఒర్రెలో పడేసి మట్టి వేసి, చెట్ల ఆకులు కప్పి ఏమి తెలియనట్లు గ్రామానికి తిరిగి వెళ్లి పోయాడు. రెండు రోజులుగా కూతురు, మనవడి జాడ లేకపోయే సరికి సుజాత తల్లి లక్ష్మవ్వ రాములును అడిగింది. రాములు సరిగా సమాధానం చెప్పకపోయే సరికి ఆమె ఆదివారం వర్ని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నపోలీసులు అనుమానితుడు రాములును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అడవిలోకి తీసుకువెళ్లగా మృతదేహాలను పూడ్చిపెట్టిన స్ధలం చూపించాడు. నిందుతుడి చెప్పిన ప్రాంతంలో తవ్వి చూడగా కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. తహసీల్దార్ సమక్షంలో మృతదేహాలను వెలికి తీసి పంచానామా నిర్వహించారు. మృతదేహాలు కుళ్లిపోవటంతో బోధన్ ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను పిలిపించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.