Attempt Murder : కూతుర్ని కాపురానికి తీసుకు వెళ్ళట్లేదని వియ్యపురాలిపై దాడి..మృతి
అవేశం అనర్ధాలకు కారణం అన్నారు పెద్దలు... కూతురు కాపురం నిలబెట్టేందుకు ఒక తండ్రి, వియ్యపు రాలిపై దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

attempt murder
Attempt Murder : అవేశం అనర్ధాలకు కారణం అన్నారు పెద్దలు… కూతురు కాపురం నిలబెట్టేందుకు ఒక తండ్రి, వియ్యపు రాలిపై దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
జగిత్యాలలోని అష్టలక్ష్మీ ఆలయం సమీపంలో నివసించే వెన్న మహేష్ తన కుమార్తె గంగా భవానీకి పట్టణానికే చెందిన గట్ల కిరణ్ కు ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం జరిపించాడు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆతర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవలు ఎక్కువవటంతో గంగాభవానీ రెండేళ్ళ నుంచి తల్లితండ్రుల వద్దే ఉంటోంది.
కూతురు కాపురం విషయంలో ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు పంచాయతీలు జరిగినా సమస్య కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో కూతురుని కాపురానికి తీసుకువెళ్లలేదనే కోపంతో ఉన్నమహేష్ సోమవారం సాయంత్రం కూతురు అత్తవారింటికి వెళ్లాడు. ఆ సమయంలో అల్లడు కిరణ్ ఇంట్లో లేకపోవటంతో… వియ్యపురాలైన కిరణ్ తల్లి గట్ల యమునతో తన కూతురు కాపురం విషయమై మాట్లాడాడు.
Also Read : Cheddi Gang : పోలీసుల అదుపులో చెడ్డీ గ్యాంగ్
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహేష్ తన మోపెడ్‌లో దాచి ఉంచిన కత్తి తీసుకువచ్చి యమునను విచక్షణా రహితంగా పొడిచి గాయపరిచాడు. పక్కన ఇంటివాళ్ళు ఈ గొడవ చూసి స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆమెను స్ధానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే యమున మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.