Dharmasthala Temple: ధర్మస్థలలో మహిళలు, యువతుల హత్యలు? సామూహిక ఖననాలు? కర్నాటకను కుదిపేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి సంచలన ఆరోపణలు..

మరి ఇన్నాళ్లు అతడు ఎక్కడున్నాడు? ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడు? అసలు ధర్మస్థల నుంచి ఎందుకు వెళ్లిపోయాడు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Dharmasthala Temple: ధర్మస్థలలో మహిళలు, యువతుల హత్యలు? సామూహిక ఖననాలు? కర్నాటకను కుదిపేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి సంచలన ఆరోపణలు..

Updated On : July 20, 2025 / 1:06 AM IST

Dharmasthala Temple: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రం ధర్మస్థల.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన సంచలన ఆరోపణలే. గత 20 ఏళ్లలో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని అతడు బాంబు పేల్చాడు. అంతేకాదు వారి మృతదేహాలను తానే పూడ్చానని చెప్పాడు. ఇంకా అతడు ఏం చెప్పాడంటే.. ఆ మృతదేహాలన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివే అన్నాడు. మరింత షాకింగ్ విషయం ఏంటంటే.. వారంతా లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయన్నాడు. ఆ వ్యక్తి చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ఆ పారిశుద్ధ్య కార్మికుడు గతంలో అక్కడ పని చేశాడు. హత్యలు, ఖననాల గురించి అతడు జులై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని పోలీసులతో చెప్పాడు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇంతకీ ఆ కార్మికుడు ఏం చెప్పాడంటే.. 1995 నుంచి 2014 మధ్య కాలంలో తాను ధర్మస్థలలో పని చేశానని తెలిపాడు. ఆ సమయంలో అనేక మంది మృతదేహాలను ఖననం చేశానని వెల్లడించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్‌ బాలికలు ఉన్నారని చెప్పాడు. వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని పేర్కొన్నాడు. 2010లో స్కూల్ డ్రెస్ లో ఉన్న ఓ బాలిక మృతదేహాన్ని మరో చోట పాతి పెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను ఖననం, దహనం చేసినట్లు వివరించాడు.

మరి ఇన్నాళ్లు అతడు ఎక్కడున్నాడు? ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడు? అసలు ధర్మస్థల నుంచి ఎందుకు వెళ్లిపోయాడు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆ వ్యక్తి స్పందించాడు. తన కుటుంబానికే చెందిన మైనర్‌ బాలికను ఉన్నతాధికారులు లైంగికంగా వేధించారని, దాంతో తాను 2014లో ధర్మస్థల నుంచి పారిపోయానన్నాడు. ఇన్నేళ్లు అజ్ఞాతంలో ఉన్నానని.. అయితే, ఆ అపరాధ భావం తనను వెంటాడుతూనే ఉందని.. దీంతో బాధితులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బయటకు వచ్చినట్లు చెప్పాడు.

జులై 11న బెళ్తంగడి న్యాయస్థానం ముందు అతడు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి.. అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫొటోలను ఆధారాలుగా అందించినట్లు తెలుస్తోంది. కొందరి పేర్లను అందులో పేర్కొన్న అతడు.. ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించినట్లు సమాచారం.

2003లో ఫ్రెండ్స్ తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది. ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో.. తన కుమార్తె మిస్సింగ్‌ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ విద్యార్థిని తల్లి సుజాతా భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపేశారని ఆమె వాపోయారు. ఇక 2012లో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం-హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది.

ఇప్పుడు, ఆ వ్యక్తి చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మెమోరాండాలు సమర్పించారు. ధర్మస్థల ప్రముఖ క్షేత్రం. పెద్ద సంఖ్యలో యాత్రికులే కాదు రాజకీయ నాయకులు, ప్రముఖులు సైతం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి మంజునాథ మందిరాన్ని పర్యవేక్షించే వారి పర్యవేక్షణలోనే లైంగిక వేధింపులు జరిగాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఈ వ్యవహారంపై పోలీసు నివేదిక సిఫార్సు చేస్తే ధర్మస్థల సామూహిక ఖనన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు వ్యతిరేకం కాదని జూలై 18న కర్నాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. “ఆరోపణలు చేసిన వ్యక్తి 10 సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు. అతడిప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చాడు. మృతదేహాలను తానే పూడ్చానని, ఆ స్థలాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని అతడు చెబుతున్నాడు. మరి పోలీసులు ఏం చెబుతారో చూద్దాం” అని సిద్ధరామయ్య అన్నారు.

జూన్ 3న పోలీసులకు రాసిన లేఖలో మహిళలపై హింసకు సంబంధించిన భయంకరమైన వివరాలను ఆ విజిల్‌బ్లోయర్ పొందుపరిచాడు. “చాలా మంది మహిళల మృతదేహాలు దుస్తులు లేదా లోదుస్తులు లేకుండా ఉన్నాయి. కొన్నింటిలో లైంగిక దాడి, హింసకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. గాయాలు లేదా గొంతు కోసి చంపడం” అని అతను లేఖలో రాశాడు. 2010లో పెట్రోల్ బంక్ సమీపంలో తాను ఒక మృతదేహాన్ని ఖననం చేశానని అతడు తెలిపాడు. అది 13 సంవత్సరాల వయస్సు గల పాఠశాల విద్యార్థినిదని చెప్పాడు. ఆమె యూనిఫాం చెక్కుచెదరకుండా ఉంది. కానీ ఆమె లోదుస్తులు కనిపించలేదన్నాడు.

Also Read: 80వేల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో 100కోట్లు దోచేసింది.. బౌద్ధ సన్యాసులే ఆమె టార్గెట్.. దేశాన్ని కుదిపేస్తున్న కుంభకోణం.. ఎవరీ విలావన్..

మరో మహిళ ముఖాన్ని యాసిడ్ పోసి కాల్చి న్యూస్ పేపర్ లో చుట్టారు. అన్ని ఖననాలు శక్తివంతమైన వ్యక్తుల బెదిరింపుల కారణంగా జరిగాయని అతను పేర్కొన్నాడు. చెప్పినట్లు చేయకపోతే “మేము నిన్ను ముక్కలుగా నరికేస్తాము”, “మిగతా వారిలాగే నిన్ను కూడా పాతిపెడతాము” అని తనను వారు హెచ్చరించారని ఆ విజిల్‌ బ్లోయర్ ఆరోపించాడు.

స్థానిక దళిత వర్గానికి చెందిన ఈ విజిల్‌బ్లోయర్ దాదాపు 20 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికుడిగా లార్డ్ మంజునాథ ఆలయ బోర్డులో పని చేశాడు. తన సొంత కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిపై ఉన్నతాధికారులతో సంబంధం ఉన్న వ్యక్తి దాడి చేశాడని, దాంతో డిసెంబర్ 2014లో ధర్మస్థల నుండి పారిపోయానని అతడు తెలిపాడు.

”దాదాపు దశాబ్దం పాటు అజ్ఞాతంలో జీవించా. అయితే నేను చూసిన, చేసిన పనులు నన్ను వెంటాడాయి. 2024లో తిరిగి వచ్చా. నిశ్శబ్దంగా ఉన్నవారికి గొంతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. మృతదేహాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతిని పొందుతాయి. నా అపరాధ భావన కూడా తగ్గుతుంది” అని అతను తన లేఖలో రాశాడు. పట్టణానికి తిరిగి వచ్చిన తర్వాత అతను కొన్ని అస్థిపంజర అవశేషాలను తవ్వి వాటిని ఫోటో తీశాడు.

”ఆలయ నిర్వహణ సంస్థలోని వ్యక్తులు ప్రభావవంతమైన వారు. నేను శక్తివంతమైన వారిని వ్యతిరేకిస్తున్నానని నాకు తెలుసు. నా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని కూడా నాకు తెలుసు” అని ఆ వ్యక్తి అన్నాడు.

దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన ఒక తీర్థయాత్ర కేంద్రం. ఈ ఆలయాన్ని ప్రభావవంతమైన జైన హెగ్గడే కుటుంబం నిర్వహిస్తుంది. రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్గడే ప్రస్తుత నిర్వాహకుడిగా ఉన్నారు. బ్రాహ్మణ పూజారులు నిర్వహించే హిందూ ఆచారాలను జైన ధర్మకర్తలు పర్యవేక్షించడం ఈ మందిరం ప్రత్యేకత.

కాగా, ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆ వ్యక్తి చేసిన ఆరోపణలు “నిరాధారమైనవి” అని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ అన్నారు. సిట్ దర్యాప్తు కోసం అప్పీల్‌ చేసిన సీనియర్ న్యాయవాది ఓజస్వి గౌడ మాట్లాడుతూ, “ఈ విషయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. సౌజన్య కేసును తప్పుగా నిర్వహించారు. అలాంటిది మళ్ళీ జరగడానికి మేము అనుమతించలేము” అని అన్నారు.