ప్రేమజంటపై దాడి.. యువతి హత్య

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక ప్రేమజంటపై దాడి చేశారు. బౌద్ధరామాల పర్యటను కేంద్రంకు బౌద్ధరామాలను చూడడానికి వచ్చిన ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడిచేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్న యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
భీమడోలు మండలానికి చెందిన నవీన్ (19), శ్రీధరణి (18) సహా మరో రెండు జంటలు బౌద్ధారామాలు చూడటానికి వెళ్లారు. మిగిలిన రెండు జంటలు కిందకు వచ్చేయగా, నవీన్, శ్రీధరణి మాత్రం రాలేదు. దీనితో అనుమానించిన బౌద్ధరామాల నిర్వహణను పర్యవేక్షించే పురావస్తుశాఖ సిబ్బంది గాలించగా పొదల్లో శ్రీ ధరణి మృతిచెంది కనిపించగా, నవీన్ తీవ్రగాయాలతో పడి ఉన్నాడు.
వెంటనే వారు తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీ ధరణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదుచేసి పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. బౌద్ధరామాలు ఉన్న చోటు అటవీప్రాంతం కావడంతో అక్కడ జనసంచారం తక్కువగా ఉండటంతో ఈదాడి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
భీమడోలు పంచాయతీ పరిధిలోని అర్జావారిగూడెంకు చెందిన నవీన్ భీమడోలులోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఇదే మండలంలోని ఎఎంపురం గ్రామానికి చెందిన శ్రీ ధరణి.. అదే కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరిద్దరికీ ఇంటర్ నుండి పరిచయం ఉండగా.. ఆదివారం కళాశాలలో ప్రైవేటు క్లాసులు ఉన్నాయని చెప్పి శ్రీధరణి ఇంటి వద్ద నుండి బయటకు రాగా.. బైక్‌పై బౌద్ధ ఆరామాల వద్దకు వీరు వెళ్లినట్లు తెలుస్తుంది. శ్రీ ధరణి దుస్తులు చిరిగి ఉండడం.. సంఘటన స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో యువతిపై లైంగికదాడి జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.