కూతురి నాలుక కోసి తినేసింది, మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు

Mother Padmaja Ate Alekhya Tongue: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్‌తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య (27) నాలుకను కోసి తినేసింది. ఈ విషయాన్ని పద్మజ భర్త పురుషోత్తం నాయుడు డాక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం డాక్టర్లకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు విశ్వసించానని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. పద్మజ, పురుషోత్తం ఇద్దరిలోనూ మానసిక వ్యాధి లక్షణాలు ఉండడంతో వారిని విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి సిఫారసు చేసినట్టు తిరుపతిలోని రుయా ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.
తన బిడ్డలు తిరిగి వస్తున్నారని, వెంటనే ఇంటికి వెళ్లాలని చెబుతున్న పద్మజ.. జైలులో తనకు తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య కనిపించడం లేదని డాక్టర్లకు చెబుతోంది. మరోవైపు, వారి రక్త సంబంధీకుల్లోనూ మానసిక సమస్యలు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. పద్మజ తండ్రి ఏకంగా 20ఏళ్లపాటు ఇలాంటి సమస్యలతోనే ఇబ్బంది పడినట్టు తేలింది. పద్మజ మేనమామలోనూ ఇలాంటి లక్షణాలే ఉన్నాయని, తండ్రి నుంచి పద్మజకు, ఆమె నుంచి ఆమె కూతుళ్లకు వంశపారంపర్యంగా ఇది సంక్రమించి ఉండొచ్చని డాక్టర్లు భావిస్తున్నారు.
5 రోజుల క్రితం కన్న కూతుళ్లను మూఢభక్తితో హత్య చేసిన కేసులో నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడు 14 రోజుల రిమాండ్ నిమిత్తం మదనపల్లె సబ్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, వారి మానసికస్థితి సరిగా లేనందున.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించాలని రెండు రోజుల క్రితం జైలు అధికారులకు డాక్టర్లు సూచించారు. కోర్టు అనుమతితో శుక్రవారం(జనవరి 29,2021) ఉదయం నిందితులను జైలు నుంచి చిత్తూరు ఏఆర్ సిబ్బంది భద్రత నడుమ తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఓపీ అనంతరం వారిద్దరినీ ఆస్పత్రిలోని సైకియాట్రీ వార్డుకు తరలించారు. నిందితుల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ భారతి ఆరా తీశారు.
మదనపల్లె శివనగర్‌లోని అక్కచెల్లెళ్లు సాయి దివ్య, అలేఖ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు తండ్రి పురుషోత్తం నాయుడు, తల్లి పద్మజను జనవరి 26న అరెస్ట్ చేశారు.
అలేఖ్య, సాయి దివ్య ఇద్దరూ తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు చేతిలో దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఈ కేసును తవ్వేకొద్దీ ఆసక్తికర కోణాలు వెలుగుచూస్తున్నా యి. చిత్తూరుకు చెందిన పద్మజ చాలా ఏళ్ల క్రితమే మదనపల్లెలో స్థిరపడ్డారు. ఆమె తల్లి చిత్తూరులోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్నారు. హత్యకు గురైన అలేఖ్య, సాయిదివ్య తరచూ అమ్మమ్మ ఇంటికి వచ్చేవారు. పద్మజ తల్లి ఇంట్లో తరచూ ఏవో పూజలు చేస్తుండేవారని తెలుస్తోంది. ఈమె దగ్గర కాలనీ వాసులు మంత్రాలు కూడా వేసుకున్నట్టు సమాచారం. అర్ధరాత్రిళ్లు ఇంట్లో నుంచి పొగలు రావడం చూశామని స్థానికులు చెబుతున్నారు. పలు మార్లు అలేఖ్య, సాయిదివ్య కూడా ఇక్కడ పూజలు చేశారని తెలిపారు. క్షుద్రపూజల పేరిట మోసాలకు పాల్పడేవారు తమిళనాడు నుంచి చిత్తూరుకు వస్తుంటారు. ఈ తరుణంలో పూజలు చేసిన వ్యక్తి చిత్తూరు మీదుగా మదనపల్లెకు వెళ్లి ఉండొచ్చనే అనుమానం తలెత్తుతోంది.