Mrinank Singh : రిషబ్ పంత్‌ను బురిడీ కొట్టించి కోటిన్నర స్వాహా చేసిన మాజీ క్రికెటర్.. పోలీసులకు ఎలా చిక్కాడంటే?
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు మృణాంక్ ను అదుపులోకి తీసుకున్న సమయంలోనూ నేను ఓ సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ బురిడీకొట్టించే ప్రయత్నం చేశాడు..

Mrinank Singh
Mrinank Singh Arrested : లగ్జరీ లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన ఓ యువ క్రికెటర్ అడ్డదారులు తొక్కి ఎన్నో మోసాలకు పాల్పడ్డాడు.. కొత్తకొత్త అవతారాలతో బురిడీ కొట్టించాడు.. ఈ యువ క్రికెటర్ బాధితుల్లో లగ్జరీ హోటళ్లతో పాటు ఓ ప్రముఖ క్రికెటర్ కూడా ఉన్నారు. మోసాలంటే లక్ష రెండు లక్షలు కాదు.. ఏకంగా కోట్లలోనే దోచేశాడు. ఘరానా మోసగాడిని ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తమదైన పద్దతిలో పోలీసులు యువ క్రికెటర్ ను విచారించగా.. అతని నేరచరిత్రను తెలుసుకొని పోలీసులే కంగుతిన్నారు.
Also Read : Virat kohli : విరాట్ కోహ్లికి షాకిచ్చిన స్టార్‌స్పోర్ట్స్..! మండిపడుతున్న ఫ్యాన్స్..
మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్.. ఈ 25ఏళ్ల యువ క్రికెటర్ గతంలో అండర్ -19 జట్టుకు ఆడాడు. ఆ తరువాత ఆటకు స్వస్తి చెప్పి మోసాలకు తెరలేపాడు. 2014 -18 వరకు ఓ ఐపీఎల్ జట్టుకు ఆడానంటూ పలువురు మహిళలు, అంతర్జాతీయ బ్రాండ్లను మోసం చేశాడు. అంతేకాదు.. 2022లో ఓ వారంపాటు ఢిల్లీలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసి.. తానో పాపులర్ క్రికెటర్ నంటూ అందరిని నమ్మించాడు. చివరికి హోటల్ బిల్లు రూ. 5.53లక్షలు చెల్లించకుండానే వెళ్లిపోయాడు. హోటల్ యాజమాన్యం మృణాంక్ ను ఫోన్ ద్వారా సంప్రదించి బిల్ కట్టాలని కోరింది.. అయితే, మృణాంక్ మాత్రం తన బిల్లు స్పాన్సర్ కంపెనీ చెల్లిస్తుందని చెప్పాడు. ఆ తరువాత వారికి రూ. 2లక్షలు చెల్లించినట్లు నకిలీ లావాదేవీ వివరాలను పంపించాడు. మోసపోయామని తెలుసుకున్న హోటల్ యాజమాన్యం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా మృణాంక్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
Also Read : Babar Azam : అలా ఎలా నేను ఔట్ అయ్యాను..! తెల్లముఖం వేసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు మృణాంక్ ను అదుపులోకి తీసుకున్న సమయంలోనూ నేను ఓ సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ బురిడీకొట్టించే ప్రయత్నం చేశాడు.. అప్పటికే ఇతన మోసాల గురించి తెలుసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృణాంక్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అతను చేసిన మోసాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక ఏడీజీపీ అధికారినంటూ పలు హోటళ్లు, రిసార్టులను మృణాంక్ మోసం చేసినట్లు తేలింది. అంతేకాక.. టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ కూడా మృణాంక్ వలలో చిక్కుకున్న వ్యక్తేనని పోలీసులు గుర్తించారు.
రిషబ్ పంత్ వద్ద ఏకంగా కోటిన్నర కొట్టేశాడు. 2021లో లగ్జరీ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నానని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తానంటూ పంత్ వద్ద 1.63కోట్లు తీసుకొని కనిపించకుండా పోయాడు. మోసపోయనని తెలుసుకున్న పంత్ .. గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృణాంక్ పలు ప్రాంతాల్లో, పలువురి పేర్లతో మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృణాంక్ ను పోలీసుల అదుపులో ఉన్నాడు.