మళ్లీ మొదలెట్టారు : నయీం గ్యాంగ్ దందాలు, ఆందోళనలో బాధితులు

నల్గొండ జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీం గ్యాంగ్ ఆగడాలు మళ్లీ మొదలుపెట్టింది. అధికారుల అండదండలతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన నయీం అడుగుజాడల్లోనే పయనిస్తుంది. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత బినామీ పేర్లపై ఉన్న ఆస్తులని సిట్ ఫ్రీజ్ చేసి ఉంచింది. దీంతో కబ్జా చేసిన తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల్లో ఉన్న ఆస్తులను అమ్మకుండా కట్టడి చేశారు. మరోసారి అతని అనుచరులు అక్రమాలకు తెరలేపి అమ్మకాలను ఆరంభించారు.
భువనగిరిలోని టీచర్స్ కాలనీ సమీపంలో 154 ఎకరాల వివాదాస్పద స్థలంలోని ఐదున్నర ఎకరాలు, మరో ప్రాంతంలో 2ఎకరాలు భూమిని అక్రమంగా అమ్మేసినట్లు సిట్‌కు, రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి.. భువనగరిలో సిట్ ఫ్రీజ్ చేసిన ఆస్తులను ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నించినట్లు గమనించారు. సర్వే నంబర్ 730లో కబ్జా చేసిన 5 ఎకరాల భూమిని అధికారుల సాయంతో అమ్మేసినట్లు గుర్తించారు.
ఈ కుట్రలలో భువనగిరి సబ్ రిజిస్ట్రార్ సహకారం అందించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ మేర భువనగిరి సబ్ రిజిస్ట్రార్ సహదేవ్, జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్‌ల ప్రమేయంపై పోలీసులు ఆరా తీశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు జరిపారు. ఈ వ్యవహారంలో భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, టౌన్ సీఐ వెంకన్న, ఇటీవల ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిన జితేందర్‌రెడ్డిల ప్రమేయంపై అనుమానవం రావడంతో రాచకొండ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
భూమి అమ్మకంపై సమాచారం ఉండి కూడా చూసీచూడనట్లు వదిలేశారని తెలియడంతో కమిషనర్ మహేశ్ భగవత్ శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డీసీపీ రామచంద్రారెడ్డిని విధుల నుంచి తప్పించి.. రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో రిపోర్ట్ చేయాలని… పోలీస్ రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు అక్కడే విధులు నిర్వహించాలంటూ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పోలీస్ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన తర్వాత… 1015 ఎకరాల భూమి, లక్ష 67 వేల చదరపు గజాల ఇళ్ల స్థలాలు, 37 భవనాలు, ఇళ్లు, అక్రమాస్తులు ఉన్నట్లు సిట్ లెక్క తేల్చింది. ఈ ఆస్తులకు సంబంధించి ఆదాయపు పన్నుల బినామీ ఆస్తుల విభాగంతో పాటు..సిట్ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ సమయంలో.. మరోసారి నయీం గ్యాంగ్ దందాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూడటం.. అందులో పోలీసు ఉన్నతాధికారిపై వేటు పడడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.