Tirupati Tragedy : వర్షపు నీటిలో మునిగి నవవధువు మృతి
తిరుపతిలో నిన్న రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసినఘటన తిరుపతిలో వెలుగు చూసింది.

Tirupati Tragedy
Tirupati Tragedy : తిరుపతిలో నిన్న రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షాలతో నగరంలో పలు లోతట్టుప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసినఘటన తిరుపతిలో వెలుగు చూసింది.
కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన కుటుంబ సభ్యులు పెళ్లి అయిన తర్వాత నూతన వధూవరులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి తుపాన్ వాహనంలో బయలు దేరి తిరుపతి వచ్చారు. వారు తిరుపతి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురిసి పలు లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. ఈ క్రమంలో వారు వస్తున్న వాహనం తిరుపతి బాలాజీ కాలనీ నుండి యం.ఆర్.పల్లి కి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి(వెస్ట్ చర్చ్) వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ లో ఇరుక్కుపోయింది.

Tirupati Tragedy 1
అక్కడ అప్పటికే 8 అడుగుల ఎత్తులో నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో లోతు తెలియని డ్రైవర్ సురక్షితంగా వెళ్లిపోవచ్చనే ధీమాతో వాహనాన్ని వేగంగా నీళ్లలోకి పోనిచ్చాడు. ఎంత వేగంగా పోనిచ్చినా ఇంజన్ లోకి నీరు చేరటంతో తుపాను వాహనం నీటిమధ్యలో చిక్కుకు పోయింది. కొద్ది సేపటిలోనే తుపాను వాహనం నీటిలో మునిగిపోయింది.

Tirupati Tragedy 2
సమాచారం తెలుసుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి వాహనంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈలోగా వాహనంలో ప్రయాణిస్తున్న నవవధువు సంధ్య అక్కడికక్కడే నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tirupati Tragedy 3
కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్.శిరీష ఈరోజు ఉదయం పరిశీలించారు. ఈ అండర్ బ్రిడ్జివద్ద నీళ్లు నిలిచిపోవటం చాలాకాలంగా జరుగుతోందని…. వాహనం నీట మునిగి నవ వధువు మరణించటం దురదృష్టకరం అని భూమన అన్నారు. ఈ మార్గంలో రోడ్డు ఎత్తు పెంచటం..నీళ్లు బయటకు వెళ్లేలా మార్గాలు ఏర్పాటు చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడి త్వరితగతిన సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.