Husband Killed: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా దారుణం.. పెళ్లైన 45 రోజులకే.. భర్తను చంపించిన భార్య..

విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Husband Killed: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా దారుణం.. పెళ్లైన 45 రోజులకే.. భర్తను చంపించిన భార్య..

Updated On : July 3, 2025 / 7:23 PM IST

Husband Killed: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రియుడి కోసం తాళి కట్టిన భర్తను చంపించింది భార్య. హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి కిరాయి హంతకులతో దగ్గరుండి మరీ భర్తను హత్య చేయించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా అలజడి రేపింది. ఇది మరువక ముందే అదే తరహా ఘోరం మరొకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 45 రోజులకే భర్తను చంపించింది మరో భార్య. 15ఏళ్లుగా ఆమె తన అంకుల్ తో (మేనమామ) సన్నిహితంగా ఉంటోంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని తాళి కట్టిన భర్తను పైకి పంపేసింది. బీహార్ ఔరంగాబాద్ లో ఈ దారుణం జరిగింది.

ప్రియాంశు కుమార్ సింగ్. వయసు 24ఏళ్లు. జూన్ 24న రాత్రి హత్యకు గురయ్యాడు. నబినగర్ రైల్వే స్టేషన్ నుంచి వస్తుండగా అతడిని కాల్చి చంపారు. వారణాసి నుంచి అతడు వచ్చాడు. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అయితే, అతడి లొకేషన్ ను అతడి భార్య కిల్లర్స్ కు షేర్ చేసింది. ఈ విషయం భర్తకు తెలియదు.

జూన్ 24 రాత్రి ప్రియాంశును గన్ తో కాల్చి చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ప్రియాంశును చంపించింది మరెవరో కాదు అతడి భార్యే అని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ప్రియాంశు భార్య గుంజా సింగ్, ఆమె మేనమామ జీవన్ సింగ్(52) ప్రియాంశు హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: హైదరాబాద్‌లో దారుణం.. బెట్టింగ్ డబ్బుల విషయంలో తండ్రి ప్రశ్నించాడని.. సర్‌ప్రైజ్ చేస్తానంటూ.. కళ్లకు గంతలు కట్టి.. గొంతులో కత్తితో..

ఈ కేసుకి సంబంధించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. గుంజా సింగ్ తన మేనమామ జీవన్ సింగ్ తో చాలా కాలంగా రహస్య సంబంధం కలిగి ఉందన్నారు. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నా.. పెళ్లికి సిద్ధమైందని, ప్రియాంశుని వివాహం చేసుకుందని చెప్పారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గురించి వీరికి తెలిసింది. దాన్ని వీరిద్దరూ స్ఫూర్తిగా తీసుకున్నారు. అదే తరహాలో ప్రియాంశును మట్టుబెట్టారు.

ప్రియాంశు హత్యకు జీవన్ సింగ్ ప్లాన్ చేశాడు. జార్ఖండ్ గర్వ్ హా జిల్లాకు చెందిన జైశంకర్ దూబే, ముకేశ్ శర్మ సాయంతో మర్డర్ కు ప్లాన్ చేశాడు. వారు సిమ్ కార్డులు సమకూర్చారు. ప్రియాంశు కదలికలను నిత్యం గమనించారు. సరైన సమయం కోసం వేచి చూశారు.

జూన్ 24వ తేదీన ప్రియాంశు తన ప్రయాణం గురించి భార్యకు వివరాలు తెలిపాడు. ఆమె ఆ సమాచారాన్ని కిల్లర్లకు చేరవేసింది. అప్పటికే రైల్వే స్టేషన్ లో మాటు వేసిన కిల్లర్లు.. ప్రియాంశును కాల్చి చంపేశారు.

భర్తను హత్య చేయించింది భార్యే అని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ప్రియాంశు భార్య గుంజా సింగ్ ను అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రధాన కుట్రదారుడు జీవన్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసులో గుంజా ప్రమేయాన్ని నిరూపించడంలో ఆమె మొబైల్ ఫోన్,కాల్ రికార్డులు కీలకమైన ఆధారాలుగా పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసుని మేఘాలయ హనీమూన్ హత్య కేసులో పోలుస్తున్నారు. ప్రియుడి మోజులో భర్తను చంపించింది భార్య. సరిగ్గా అదే తరహా నేరం బీహార్ లోనూ జరిగింది. ఈ రెండు కేసుల్లో నవ వధువులు తమ రహస్య సంబంధాన్ని దాచిపెట్టి తాళి కట్టిన భర్తలను వదిలించుకోవడానికి అత్యంత దారుణానికి ఒడిగట్టిన వైనం భయాందోళనకు గురి చేస్తోంది.