డేట్ ఫిక్స్ : నిర్భయ దోషులకు ఒకేసారి ఉరి…ఏర్పాట్లు రెడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉరితీయనున్నారు. దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌కి ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయనున్నారు.
ఈ మేరకు తీహార్ జైలులో నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 7న నలుగురు దోషుల డెత్ వారెంట్‌లపై ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు తీర్పు వెల్లడించనుండగా…ఆ వెంటనే వారికి ఉరి శిక్ష అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నలుగురిని ఒకేసారి ఉరితీయడం దేశచరిత్రలో ఇదే తొలిసారి.
కాగా, డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.