కరోనా ఎఫెక్ట్, హైదరాబాద్ లో మద్యం దొరక్క ఆత్మహత్య
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం

దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తో అన్ని వ్యాపారాలు బంద్ అయ్యాయి. నిత్యావసరాలు, వైద్య, అత్యవసర సదుపాయాలు మినహా అన్ని దుకాణాలకు తాళం పడింది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇకపోతే మద్యానికి బానిసలైన మందుబాబుల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది.
మద్యం దొరక్క పిచ్చోలవుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు:
లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూసివేయడంతో.. మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యానికి బానిసైన మందుబాబులు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు మద్యం చుక్క పడందే రోజు ప్రారంభించని వారికి, నిద్ర పట్టని వారికి లాక్ డౌన్ శాపంగా మారింది. ఎక్కడా మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. పిచ్చోళ్లైపోతున్నారు. కొందరు ఏకంగా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం లభించడం లేదని హైదరాబాద్‌లో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా.. మరో వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది.
మతిస్థిమితం కోల్పోయి ఆత్మహత్య:
బంజారాహిల్స్ ఇందిరానగర్ లో నివాసం ఉంటూ సినీ పరిశ్రమలో పెయింటర్ గా పని చేస్తున్న మధుకి (55) రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. కొన్ని రోజులుగా వైన్ షాపులు మూసేయడంతో అతనికి మద్యం దొరకడం లేదు. మతిస్థిమితం కోల్పోయిన మధు.. గురువారం(మార్చి 26,2020) రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జడ్జీస్ క్వార్టర్స్‌కు వెళ్లాడు. అక్కడ ఎనిమిదో బ్లాక్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి దూకేశాడు:
బేగంపేట బ్రాహ్మణవాడికి చెందిన సాయికుమార్ (32)కు కూడా నిత్యం మందు తాగే అలవాటుంది. టైల్స్ పని చేసే సాయికుమార్ కొన్ని రోజులుగా మద్యం దొరకడం లేదని శుక్రవారం(మార్చి 27,2020) పంజాగుట్ట సర్కిల్‌లోని రెండు ఫ్లైఓవర్స్ మధ్య నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, ప్రాణాపాయం తప్పగా అతని కాలు విరిగింది. పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కేరళలో చెట్టుకి ఉరేసుకుని సూసైడ్:
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కేరళలోనూ మద్యం ప్రియుల పరిస్థితి ఇలానే ఉంది. కేరళలో ఓ మందుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిసూర్ జిల్లాకు చెందిన సనోజ్(35) కు గత వారం రోజుల నుంచి మద్యం లేకపోయే సరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం దొరక్కపోవడంతో మనస్తాపానికి గురైన సనోజ్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటికే మద్యం సరఫరా చేసే విధంగా అనుమతివ్వాలని కోర్టులో పిటిషన్:
మందు చుక్క పడక నరాలు జివ్వుమని లాగుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక మందు బాబులు డీఅడిక్షన్ సెంటర్‌లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే ఓ మందు బాబు మాత్రం నిత్యావసరాల లాగానే ఇంటికే మద్యం సరఫరా చేసే విధంగా అనుమతివ్వాలని ఓ వ్యక్తి కేరళ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. పిటిషనర్‌కు కోర్టు రూ. 50 వేలు జరిమానా విధించింది.
కల్లు దొర్కక వ్యక్తి మృతి:
మందుబాబులే కాదు కల్లు ప్రియులు సైతం విలవిలలాడిపోతున్నారు. కల్లు దొరక్క మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నారు. వాళ్లకు నిద్ర కూడా కరువైంది. ఈ ప్రభావం వారి ఆరోగ్యాలపై పడుతోంది. కొంతమందికి ఫిట్స్ రావడం, పిచ్చి పిచ్చిగా, వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు బయటపడుతున్నాయి.
నిజామాబాద్ లో కల్లు ప్రియులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్లు దొరక్కపోవడంతో వారికి పిచ్చెక్కింది. కాగా స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. కల్లు దొరక్కపోవడంతో ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి చనిపోయాడు. కల్లు ప్రియులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు.