Ganja In Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ganja In Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు విద్యార్థులు

Updated On : August 20, 2022 / 10:36 PM IST

Ganja In Basara IIIT : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని విచారించారు. దీంతో గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల నుంచి 35 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు.

”కాలేజీ క్యాంపస్ లో విద్యార్థులు గంజాయి సేవిస్తూ కనిపించారు. వర్సిటీలో ఆ ఇద్దరు విద్యార్థులు ఈ2 కోర్సు చదువుతున్నట్టు చెప్పారు. వారి హాస్టల్ దగ్గర నిషేధిత మత్తు పదార్ధం తీసుకుంటూ కనిపించారు. అనుమానం వచ్చి వారిని అదుపులోనికి తీసుకున్నాం. ఆ ఇద్దిరినీ విచారించాము. గంజాయి సేవించినట్లు ఆ ఇద్దరు ఒప్పుకున్నారు. తమ స్నేహితుడు నాందేడ్ కు చెందిన విద్యార్థి ద్వారా తమకు గంజాయి అందినట్లు వారు విచారణలో చెప్పారు. ఆ ఇద్దరు విద్యార్థులను జుడిషియల్ రిమాండ్ కు తరలించాము. కేసు నమోదు చేశాము. విచారణ జరుగుతోంది” అని ముధోల్ ఇన్ స్పెక్టర్ వినోద్ తెలిపారు.

గంజాయి సేవిస్తూ ఇద్దరు విద్యార్థులు పోలీసులకు పట్టుబడం కాలేజీలో కలకలం రేపింది. తోటి విద్యార్థులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ తిన్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా పెడదోవ పట్టడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంకా ఎంతమంది విద్యార్థులు ఇలా మత్తుపదార్ధాలకు బానిసలుగా మారారోనని కంగారుపడుతున్నారు. కాలేజీలో ఇలాంటి ఘటనలు జరక్కుండా నిఘా పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.