ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు వరుస ఎదురుదెబ్బలు.. తల్లి అరెస్ట్, తండిపై కేసు

అధికార దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వ ఆగ్రహానికి గురైన మహారాష్ట్ర వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు వరుస ఎదురుదెబ్బలు.. తల్లి అరెస్ట్, తండిపై కేసు

puja khedkar mother manorama khedkar arrested by pune police

Updated On : July 18, 2024 / 1:24 PM IST

puja khedkar: మహారాష్ట్ర వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారం దుర్వినియోగం ఆరోపణలతో ఆమెపై ఇప్పటికే కేంద్ర సర్కారు చర్య తీసుకుంది. శిక్షణ నిలిపివేసి నేషనల్ అడ్మినిస్ట్రేషన్‌ అకాడమీకి తిరిగి రావాలని సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) ఆదేశించింది. తాజాగా ఆమె తల్లి మనోరమ ఖేద్కర్‌ను పుణే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తుపాకీ కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. రాయ్‌గఢ్ జిల్లాలోని రాయగఢ్ కోట సమీపంలో ఉన్న లాడ్జిలో తలదాచుకున్న మనోరమను ఈ ఉదయం అదుపులోకి తీసుకుని పుణేకు తరలించారు.

తుపాకీతో రైతును మనోరమ బెదిరించిన వీడియో వైరల్ కావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుణే జిల్లాలోని ముల్షి గ్రామంలో భూమి వివాదం సందర్భంగా తన దగ్గరున్న తుపాకీతో రైతును మనోరమ బెదిరించారు. భూమి విషయంలో రైతుతో వాగ్వాదానికి దిగిన ఆమె.. తన తుపాకీని బయటకు తీసి బెదిరించేలా వ్యవహరించారు. వీడియో తీస్తున్నారని తెలియగానే తుపాకీని దాచేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో బయటకు రావడంతో పుణే పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆమె భర్త, రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్ ఖేద్కర్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు.

Also Read : షాకింగ్.. ఫ్రెండ్ ప్రాణం తీసిన సరదా.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి..

పూజా ఖేద్కర్‌ తండ్రి దిలీప్ ఖేద్కర్ పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు ఆయన రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. 2018లో కొల్హాపూర్‌లో ప్రాంతీయ అధికారిగా పని చేస్తున్నప్పుడు ఆయన మొదటిసారి సస్పెన్షన్ కు గురయ్యారు. విద్యుత్, వాటర్ కనెక్షన్ పునరుద్ధరించడానికి ఆయన రూ.50,000 వరకు లంచం డిమాండ్ చేశాడని స్థానిక సామిల్, కలప వ్యాపారుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ప్రభుత్వం చర్య తీసుకుంది. ఇలాంటి ఆరోపణలతోనే 2020లో రెండోసారి సస్పెండ్ అయ్యారు.

పూజా ఖేద్కర్‌ ఫ్యామిలీకి భారీగా ఆస్తులు ఉన్నట్టు ఎన్డీటీవీ వెల్లడించింది. ఖేద్కర్‌ ఫ్యామిలీకి మహారాష్ట్రలో రూ. 22 కోట్ల విలువచేసే ఐదు ప్లాట్లు, రెండు అపార్ట్‌మెంట్‌లు ఉన్నట్టు తెలిపింది. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Also Read : భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చిన ఫోటోషూట్.. ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి.. వీడియో వైరల్