స్టీరింగ్ వదిలేసి నిద్రపోయిన ఊబెర్ డ్రైవర్ …స్వయంగా క్యాబ్ డ్రైవ్ చేసిన పాసింజర్

  • Published By: chvmurthy ,Published On : March 4, 2020 / 05:20 PM IST
స్టీరింగ్ వదిలేసి నిద్రపోయిన ఊబెర్ డ్రైవర్ …స్వయంగా క్యాబ్ డ్రైవ్ చేసిన పాసింజర్

Updated On : March 4, 2020 / 5:20 PM IST

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా…. డ్రైవర్ నిద్రలోకి జారుకోవటంతో ప్రమాదం జరిగింది అని చెపుతూ ఉంటారు. కొంత మంది డ్రైవర్లు  పగలు రాత్రి అనే తేడాలేకుండా కష్టపడి క్యాబ్ సర్వీసులు నడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ల వల్లే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసినా ఎదుటివారు సరిగా నడపక పోయినా మనకే ప్రమాదం.  అలా నిద్రపోయే డ్రైవర్లు ఉన్నా మనకే ఫ్రమాదం. UBER  Cab ఎక్కిన ఒక మహిళా ప్రయాణికురాలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.  

పూణేకు చెందిన క్యాబ్ డ్రైవర్ బండి నడుపుతూ నిద్రలోకి జారుకున్నాడు. స్టీరింగ్ వదిలేసి కునుకు తీయటంతో రెండుసార్లు కారు ప్రమాదానికి గురయ్యేది. ఇంక ఇలా వెళితే ఇంటికి కన్నా పరలోకానికి వెళతామనుకున్న ప్రయాణికురాలు డ్రైవర్ను తప్పించి తానే స్టీరింగ్ తీసుకుని క్షేమంగా గమ్యానికి చేరింది. 

తేజస్వి దివ్యనాయక్ అనే మహిళ  పుణే నుంచి ముంబై వెళ్లటానికి  ఫిబ్రవరి21, మధ్యాహ్నం 1 గంట సమయంలో   UBER  Cab బుక్ చేసుకుంది.  ప్రయాణం మొదలైంది. అప్పటికే బాగా అలసి పోయిన డ్రైవర్  నిద్ర మత్తులోకి జారుకుంటున్నాడు.  ఒకానొక చోట ఎదురుగా వస్తున్న వాహనాన్నిఢీ కొట్ట బోయాడు. అలా రెండు సార్లు జరిగింది.

డ్రైవర్ నిద్రపోకుండా ఉండేందుకు అతడితో మాట్లాడటం మొదలెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా డ్రైవర్ నిద్రలోకి జారుకుని స్టీరింగ్ వదిలేస్తున్నాడు. ఇక అతడు కారు నడిపే పరిస్ధితిలో లేడని తెలుసుకున్న తేజస్వీని కారును  పక్కకు ఆపమని కోరింది. 

ఆమెకు డ్రైవింగ్ తెలియంతో డ్రైవర్ ను ఒప్పించి స్టీరింగ్ అందుకుంది. డ్రైవర్ ను పక్కసీట్లో కూర్చో బెట్టింది.  స్టీరింగ్ అందుకుని కారు నడిపింది. పక్క సీట్లో కూర్చున్న డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు.   ఆమె కారును డైవ్ చేసుకుంటూ తన గమ్య స్ధానానికి చేరింది. ఊబెర్ కారులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేసింది.  

గమ్యానికి చేరుకున్నాక డ్రైవర్ కు చార్జీలు ఇవ్వకపోగా ఊబెర్ కు ఫిర్యాదు చేసింది. కాగా ఊబెర్ తనకు క్షమాపణలు మాత్రమే చెప్పిందని తనకు  పరిహారం చెల్లించలేదని  వాపోయింది.  పరిహారం కావాలంటే పోలీసులకు ఫిర్యాదు చేసి FIR కాపీని తమకు పంపాలని ఊబెర్ చెప్పిందని ఆమె తెలిపింది.