వనస్థలిపురంలో దోపిడీ ఘటన : పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి ఉపయోగించిన ఆటోని గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (మే7, 2019)… వనస్థలిపురంలో ఏటీఎం మిషన్లలో డబ్బులు పెట్టె వ్యాన్ నుంచి 70 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సిబ్బంది దృష్టి మరల్చిన దుండగులు… 70 లక్షలు చోరీ చేసి పారిపోయారు. యాక్సిస్ బ్యాంకులో డబ్బులు నింపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మంగళవారం (మే7, 2019) మధ్యాహ్నం వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు… మనీ లోడింగ్ వాహనంలో డబ్బులు తీసుకొచ్చారు సిబ్బంది. ఆ సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ఇద్దరు దుండగులు… డబ్బులు కింద పడ్డాయని చెప్పి సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చారు. అదే సమయంలో మరో వ్యక్తి వాహనంలోని నగదు పెట్టెను ఎత్తుకుని రోడ్డు దాటాడు. అటుగా వస్తున్న ఓ ఆటోలో పెట్టి రోడ్డు దాటించారు. ఆ తర్వాత అటు వైపు మళ్లీ పెట్టెను మోసుకుంటూ పరారయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు… డబ్బు పెట్టెను తీసుకెళ్లిన ఆటోని గుర్తించారు. ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 20 బృందాలుగా విడిపోయిన పోలీసులు… దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ చోరీ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పననేని హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. 70 లక్షల చోరీ కేసులో 8 మంది పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దోపిడీలో మనీ లోడింగ్ సిబ్బంది హస్తం కూడా ఉండొచ్చనే అనుమానాలు రేగుతున్నాయి. ఏటీఎంల దగ్గర చోరీల గురించి అవగాహన ఉన్నా… అంత తేలిగ్గా ఎలా దుండగుల మాటలు నమ్మి… డబ్బును ఎలా గాలికొదిలేశారనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.