మద్యం చిచ్చు : పిల్లల గొంతు కోసి చంపేసిన తల్లి

ఆర్థిక ఇబ్బందులు..కుటుంబ తగాదాలు..క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను సైతం దారుణంగా చంపేస్తున్నారు. కొన్ని రోజులుగా కొంతమంది తల్లులు..పెగు తెంచుకుని పుటటిన పిల్లలను కడతేరుస్తున్న విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా జనగామ జిల్లా..నర్మెట్ట మండలం శివభూక్య తండాలో ఇద్దరు పిల్లలను గొంతు కోసిన ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పటి వరకు సరదాగా ఆడుకుంటున్న చిన్నారులు రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు..కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు.
శివభూక్యా తండానికి చెందిన బానోతు గోపాల్, బానోతు రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అరుణ్ (3), కూతురు భానుశ్రీ (4) సంతానం. అయితే..గోపాల్ మద్యానికి బానిస కావడంతో కుటుంబంలో తగదాలు మొదలయ్యాయి. భార్య భర్తల తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో తాను కుటుంబాన్ని నెట్టుకరాలేనని భావించిన రమాదేవి..అరుణ్, భానుశ్రీలను హత్య చేసి..తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం ఇద్దరు పిల్లల గొంతు కోసి..ఆత్మహత్యకు ప్రయత్నించింది రమాదేవి. ఇది గమనించిన తండా వాసులు ఆమెను జనగామ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.