రోబో 2 దొంగలు : హైవేపై స్మార్ట్ ఫోన్ల కంటెయినర్ దోపిడీ

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 06:38 AM IST
రోబో 2 దొంగలు : హైవేపై స్మార్ట్ ఫోన్ల కంటెయినర్ దోపిడీ

నెల్లూరు : స్మార్ట్ ఫోన్స్ భారీ దొంగతనం జరిగింది. వంద.. వేలు కాదు ఏకంగా ఓ స్మార్ట్ ఫోన్ల కంటైనర్ చోరీకి గురయ్యింది. ఓ కంటెయినర్ నిండా స్మార్ట్ ఫోన్ల లోడ్ తో వస్తున్న లారీని దొంగలు ఎత్తుకుపోయిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం అయ్యింది. నెల్లూరు జిల్లా దగదర్తి సమీపంలో లారీని అడ్డగించిన కొందరు దొంగలు.. డ్రైవర్ ను కొట్టి కంటెయినర్ ను ఎత్తుకెళ్లారు. కంటెయినర్ నిండా మొబైల్ ఫోన్లు ఉన్నాయని, వీటి విలువ రూ. 4 కోట్లకు పైగానే ఉంటుందని డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నెల్లూరు పోలీసులు రంగంలోకి దిగారు.

కంటెయినర్ ను తీసుకెళ్లిన దొంగలు..అతి చాక చక్యం ప్రదర్శించారు. కంటైనర్ ను గుర్తించే ప్రమాదముందని ముందే గుర్తించిన దొంగలు.. ఫోన్లన్నీ మరో వాహనంలోకి షిఫ్ట్ చేశారు. ఖాళీ లారీ (కంటైనర్)ని గౌరవరం గ్రామం దగ్గర వదిలేశారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారు అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, కడప  జిల్లాల్లోని అన్ని పోలీసు స్టేషన్లనూ అలర్ట్ చేశారు. 4 కోట్ల రూపాయల విలువైన ఫోన్ల కావటం, జాతీయ రహదారిపై జరిగిన దోపిడీ కావటంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దించారు.

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో కొత్త ఫోన్లు అమ్మకాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి.. షోరూంల్లో అమ్మకాలు – కోనుగోళ్లపై నిఘా పెట్టారు. కొన్ని షోరూమ్స్ లో లావాదేవీలను పరిశీలించనున్నారు పోలీసులు. త్వరలోనే ఈ దోపిడీని చేధిస్తామని చెబుతున్నారు.