ఫేక్ న్యూస్ ప్రచురించిన సోషల్ మీడియా అధినేత అరెస్టు

హైదరాబాద్: ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఇంటిలిజెన్స్ సంస్ధ సర్వే నిర్వహించిందని సోషల్ మీడియాలో తప్పుడు కధనాలు ప్రచురించిన టీఎస్ఎఫ్ సంస్ధపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్ధ డైరెక్టర్ శాకమూరి తేజోభానును శుక్రవారం అరెస్టు చేశారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి సోషల్ మీడియా లో లెక్కలేనన్ని సర్వేలు వైరల్ అవుతున్నాయి. ఆ సర్వేలతో సామాన్య జనం కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారు.
తెలంగాణ ఇంటిలిజెన్స్ డిపార్ట్ మెంట్ కూడా సర్వే నిర్వహించిందంటూ టీఎస్ఎఫ్ సంస్ధ ఒక ఫేక్ వార్తను తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవటంతో, తెలంగాణ ఇంటిలిజెన్స్ విభాగం ఆసంస్ధపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వార్త రాసిన స్క్రిప్ట్ రైటర్ ముప్పాళ్ల ప్రసన్నకుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శుక్రవారం తాజాగా సంస్ధ డైరెక్టర్ శాకమూరి తేజోభానును అరెస్టు చేశారు. ఫేక్ వార్త ప్రచురించే విషయంలో మరో డైరెక్ట్రర్ గా ఉన్న సంయుక్త..పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.