బ్రేకింగ్ : శ్రావణి, మనీషాల హంతకుడు ఇతడే.. స్కూల్, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చి దారుణాలు

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 03:43 PM IST
బ్రేకింగ్ : శ్రావణి, మనీషాల హంతకుడు ఇతడే.. స్కూల్, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చి దారుణాలు

Updated On : April 29, 2019 / 3:43 PM IST

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా మర్డర్ కేసుల్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. స్కూల్, కాలేజీలకు వెళ్లి వచ్చే వారిని టార్గెట్ చేసే శ్రీనివాస్ రెడ్డి.. బొమ్మలరామారం నుంచి హాజీపూర్ గ్రామానికి వెళ్లే యువతులకు లిఫ్ట్ ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలింది. మనీషాకు లిఫ్ట్ ఇచ్చి బావి దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపినట్లు పోలీసుల ఎంక్వైరీలో వెలుగుచూసింది. అదే తరహాలో 10వ తరగతి విద్యార్థిని శ్రావణిని కూడా శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హాజీపూర్ గ్రామానికే చెందిన బాలిక కల్పన మిస్సింగ్ కేసులోనూ శ్రీనివాస్ రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రావణి మర్డర్ కేసులో అనుమానితుడిగా అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హాజీపూర్ గ్రామానికి బస్సు సర్వీసులు తక్కువగా ఉన్నాయి. దీంతో బైక్ పై వెళ్లే వారిని లిఫ్ట్ అడగటం గ్రామస్తులకు అలవాటు. శ్రీనివాస్ రెడ్డి దీన్ని ఆసరాగా తీసుకున్నాడు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి తిరిగి ఊరికి వచ్చే అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చేవాడు. లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను మచ్చిక చేసుకుని స్నేహం చేసేవాడు. ఇదే రీతిలో శ్రావణి, మనీషాలకు శ్రీనివాస్ పలుసార్లు లిఫ్ట్ ఇచ్చాడు. తనపై వారికి నమ్మకం కలిగేలా చేసుకున్నాడు. ఏదో పని ఉన్నవాడిలా అటుగా వెళ్లడం.. అమ్మాయిలకు లిఫ్ట్ లు ఇవ్వడం చేసేవాడు. తనపై నమ్మకం కలిగిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఘోరాలకు పాల్పడేవాడు. ముందు అత్యాచారం, తర్వాత హత్య చేసేవాడు. శివరాత్రి రోజున మనీషాను లిఫ్ట్ పేరుతో బైక్ పై ఎక్కించుకుని బావి దగ్గరకి తీసుకెళ్లిన శ్రీనివాస్.. అక్కడ మనీషాపై అత్యాచారం చేసి చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆపై మృతదేహాలను తన బావిలోనే పాతిపెట్టాడని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డికి నేర చరిత్ర ఉంది. అంతేకాదు ఎలాంటి బావి అయినా అందులోకి దిగడం, తిరిగి పైకి రావడంలో అతడు సిద్దహస్తుడు.

డిగ్రీ విద్యార్థిని మనీషా తండ్రికి నలుగురు కుమార్తెలు. పెద్ద కూతురు మినహా మిగతా ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మనీషా కూడా లవ్ మ్యారేజ్ చేసుకుందేమోనని తండ్రి అనుకున్నాడు. మనీషా అదృశ్యం అయినా సైలెంట్ గా ఉన్నాడు. బయటకు చెబితే పరువు పోతుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు. దీంతో మనీషా హత్య విషయం వెలుగులోకి రాలేదు. ఇదే అదనుగా శ్రీనివాస్ రెడ్డి మరింతగా రెచ్చిపోయాడు. అదే తరహాలో శ్రావణిని టార్గెట్ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. శ్రావణికి రెండు మూడు సార్లు లిఫ్ట్ ఇచ్చాడు. ఆ అమ్మాయిని మచ్చిక చేసుకున్నాక..  ఏప్రిల్ 26వ తేదీన కీసరలో శ్రావణికి లిఫ్ట్ ఇచ్చాడు. అక్కడి నుంచి నేరుగా బైక్ పై హాజీపూర్ గ్రామంలోని బావి దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం జరిపి హతమార్చాడు. శ్రావణిని హత్య చేసిన రోజు గ్రామంలోని యువకులతో శ్రీనివాస్ రెడ్డి క్రికెట్ ఆడాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాతి రోజు గ్రామంలో ఓ పెళ్లికి హాజరయ్యాడు. శ్రావణిని తన బైక్ పై ఎక్కించుకునే దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కడంతో శ్రీనివాస్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు.