స్కూల్ లో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 05:36 AM IST
స్కూల్ లో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

Updated On : April 6, 2019 / 5:36 AM IST

తమిళనాడులో విషాదం నెలకొంది. పాఠశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ ఆలయం సమీపం కుమరాట్చి మెయ్యత్తురైకి చెందిన ఏలుమలై (39) ఉప్పు వ్యాపారి. అతని రెండో కుమార్తె దుర్గాదేవి (13) స్థానిక ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇంటి సమీపంలోనే పాఠశాల ఉండడంతో కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఉదయం దుర్గాదేవి పాఠశాల గేట్‌ను తెరచి ఉంచేది. రోజూలాగే బుధవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని దుర్గాదేవి గేట్, తరగతి గదులు, మరుగుదొడ్లను తెరిచింది. తరువాత మరుగుదొడ్డికి వెళ్లిన దుర్గాదేవి అక్కడే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పాఠశాల ప్రారంభమైన తరువాత విద్యార్థినులు మరుగుదొడ్డి వైపు వెళ్లగా అక్కడ దుర్గాదేవి శవంగా వేలాడుతుండడం చూసి కేకలు వేశారు. ఉపాధ్యాయులు వెంటనే కుమరాట్చి పోలీసులకు, బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాఠశాల దగ్గరకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.