కానిస్టేబుల్ ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియురాలు

పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని పెద్దలు సామెత చెపుతుంటారు. అక్రమ సంబంధాలకు అలవాటు పడిన కానిస్టేబుల్ ని చివరికి అతడి ప్రియిరాలే పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకి వెళితే …తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వెంకటేష్(31) చెన్నైలోని సత్యమూర్తి నగర్లోని పోలీసు క్వార్టర్స్ లో నివసిస్తున్నాడు. వెంకటేష్ ఆవడి స్పెషల్ పోలీస్ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అతనికి 2012 లో జయ అనే మహిళతో వివాహాం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. పాప, బాబు ఉన్నారు.
ఇలా ఉండగా వెంకటేష్ కుపులియాంతోపు ప్రాంతానికి చెందిన ఆషా (32) మహిళతో పరిచయం అయ్యింది. ఆషాకు అంతకు ముందే ధర్మలింగం అనే వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆషాతో వెంకటేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం జయకు తెలియడంతో భర్తను నిలదీసింది. అతడిలో మార్పు రాకపోవడంతో 2015లో కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లింది. కుమార్తె తండ్రితోనే ఉండిపోయింది. అనంతరం వెంకటేశ్ తన ప్రియురాలు ఆషాను క్వార్టర్స్‌కు తీసుకొచ్చాడు.
ఈ క్రమంలో వెంకటేశ్‌కు ఒక మహిళా కానిస్టేహబుల్ తో సంబంధం ఉందన్న విషయం ఆషాకు తెలిసింది. దీంతో ఆమె శనివారం అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్‌ను మహిళా కానిస్టేబుల్ తో సంబంధం విషయమై గట్టిగా నిలదీసింది. వెంకటేష్ ఆ సమయంలో మద్యం మత్తులో ఉండడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్ధాయిలో వాగ్వాదం జరిగింది. వెంకటేష్ ప్రవర్తనకు ఆగ్రహానికి గురైన ఆషా ఇంట్లో ఉన్న పెట్రోలును వెంకటేశ్‌పై పోసింది. మత్తు వదిలిన వెంకటేష్ బయటకి పరుగు తీసాడు. ఈలోపు ఆషా అగ్గిపుల్ల వెలిగించి వెంకటేష్ పై వేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. 85 శాతం కాలిన గాయలతో ఉన్న వెంకటేష్ను స్థానికులసహాయంతో ఆదివారం తెల్లవారుఝూమున 2 గంటల సమయంలో కీల్పాక్కం ఆస్పత్రిలో చేర్చారు.
తన భర్త ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని ఆషా డాక్టర్లకు తెలిపింది. డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా …తిరుముల్‌లైవాయిల్ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తమన్ కేసు నమోదు చేసుకుని ఆషాను విచారించటంతో మొత్తం విషయం బయట పడింది. దీంతో ఆషా పై హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.