తెలంగాణ సైబర్ సెక్యూరిటీ భారీ ఆపరేషన్ సక్సెస్.. 27మంది సైబర్ క్రిమినల్స్ అరెస్ట్
మొబైల్ ఫోన్ కు అనుమానిత లింకులు వస్తే క్లియ్ చేయొద్దని సూచించారు. ఒకవేళ అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.

Cyber Criminals Arrest : సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపింది. దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో సైబర్ సెక్యూరిటీ టీమ్ అలర్ట్ అయ్యింది. తొలిసారి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంతర్ రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించి 27 మంది సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేసింది. సైబర్ నేరగాళ్ల నుంచి పెద్ద మొత్తంలో నగదు సహా ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.
దక్షిణాసియా దేశాలు సైబర్ నేరాలకు హబ్ గా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శికా గోయల్ హెచ్చరించారు. మొబైల్ ఫోన్ కు అనుమానిత లింకులు వస్తే క్లియ్ చేయొద్దని సూచించారు. ఒకవేళ అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.
సైబర్ నేరస్తులపై పోలీసుల నిఘా పెరగడంతో సైబర్ నేరగాళ్లు నగరాలు వదిలి గ్రామాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని గోయల్ తెలిపారు. రాజస్తాన్ కు చెందిన ముఠా రాష్ట్రంలో భారీగా సైబర్ నేరాలకు పాల్పడినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. పేదలు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ ముఠాపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. అనంతరం అంతర్ రాష్ట్ర ఆపరేషన్ చేపట్టి వివిధ రూపాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు. వారి కోసం 20 రోజుల పాటు గాలించి అదుపులోకి తీసుకున్నారు. ఇక పట్టుబడ్డ నిందితులపై రాష్ట్రంలో 189 కేసులు ఉండగా.. అనేక రకాల ఆరోపణలూ ఉన్నాయి.
* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ సక్సెస్
* 27 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
* నిందితుల నుంచి 31 సెల్ ఫోన్లు, 37 సిమ్ కార్డులు, 13 ఏటీఎం కార్డులు స్వాధీనం
* 7 చెక్ బుక్కులు, 2 హార్డ్ డిస్క్ లు స్వాధీనం
* పట్టుబడ్డ సైబర్ నిందితులపై తెలంగాణలో 189 కేసులు
* దేశవ్యాప్తంగా నిందితులపై 2,223 కేసులు నమోదు
* ఇప్పటివరకు రూ.9 కోట్ల కొట్టేసిన నిందితులు
* 29 ఫేక్ అకౌంట్ల ద్వారా రూ.11 కోట్లకుపైగా దోపిడీ
* ఫోన్ కి వచ్చే అనుమానిత లింక్స్ ఓపెన్ చేయొద్దన్న పోలీసులు
* స్పామ్ అని తెలిస్తే సైబర్ క్రైమ్ ను ఆశ్రయించాలన్న పోలీసులు