ముంబై క్రైం స్టోరీ : రెండో భార్య.. మొదటి భార్య పిల్లలతో కలిసి.. మూడో భార్యను చంపేసింది

ముంబై క్రైం స్టోరీ : రెండో భార్య.. మొదటి భార్య పిల్లలతో కలిసి.. మూడో భార్యను చంపేసింది

టైటిల్ చూసి కన్ఫ్యూజ్  కావొద్దు.. ఒకటికి రెండుసార్లు చదివితేకానీ ఓ క్లారిటీ రాలేం. ముంబైలో జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. ఓ కుటుంబంలో జరిగిన గొడవలతో జరిగిన ఈ హత్య ముంబై పోలీసులకే ముచ్చెమటలు పట్టించింది. ఇంటి గుట్టును ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అన్నట్లు సాగిన ఈ క్రైం స్టోరీని మాత్రం ముంబై పోలీసులు చేధించగలిగారు. వివరాల్లోకి వెళితే..

మొదటి వివాహం:
శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్నది పాత సామెతే అయినా మరోసారి నిరూపితమైంది. ముంబై సిటీ నలసోపురాలో నివాసం ఉంటున్న సుశీల్ అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 45 ఏళ్ల వయస్సున్న సుశీల్ కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తున్నాడు. చిన్న వయస్సుల్లోనే సుశీల్‌కు పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. మొదటి భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది. సుశీల్ మాత్రం ముంబైలోనే పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు. 

రెండో వివాహం:
ఈ సమయంలో పార్వతి మానే అనే యువతితో పరిచయం అయ్యింది. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతో కలిసి ముంబైలోని మానె ప్రాంతంలో కాపురం పెట్టాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇద్దరు భార్యలతో సాఫీగా సాగిపోతున్న సంసారంలో గొడవలు మొదలయ్యాయి. రెండో భార్య పార్వతితో విబేధాలు వచ్చి.. ఏడాది క్రితం విడిపోయాడు. ముంబైలోనే వేరుగా ఉంటుున్నాడు. 

మూడో వివాహం:
ఒంటరిగా ఉంటున్న సుశీల్‌కు మరో యువతి యోగితా దేవ్రే (35) పరిచయం అయ్యింది. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఏడాదిగా గోప్యంగా ఉన్న ఈ పెళ్లి వ్యవహారం ఇటీవలే మొదటి, రెండో భార్యకు తెలిసింది. మూడో పెళ్లి చేసుకున్న సుశీల్‌తో గొడవకి దిగారు. డబ్బులు ఇవ్వాలని.. ఉన్న కొద్ది ఆస్తిని మాకు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి సుశీల్ నిరాకరించాడు. దీంతో వారిలో కోపం కట్టలు తెచ్చుకుంది. ఇక్కడ క్రైం కథకు స్కెచ్ పడింది.

రచ్చ మొదలైంది:
రెండో భార్య పార్వతి.. మొదటి భార్య కూతుళ్లు కలిశారు. ఇన్నేళ్లుగా కలిసున్న మన మధ్యలోకి మూడో భార్య రావడం ఎవ్వరికీ నచ్చలేదు. మొత్తం డబ్బు, ఆస్తి పట్టుకుపోతుంది అని అసూయతో రగిలిపోయారు. మూడో పెళ్లి అయిన దగ్గరి నుంచి చిల్లగవ్వ కూడా అందడం లేదని రెండో భార్య కుళ్లుకుంది. మూడో భార్య యోగితాను చంపేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఆడవారే కావటంతో.. మొదటి భార్య.. మొదటి కూతురు బాయ్ ఫ్రెండ్ సాయం తీసుకుని పని పూర్తి చేసేశారు. 

స్కెచ్ ఇలా వేశారు:
మొదటి భార్య కూతురు, రెండో భార్య, ఆమె కూతుళ్లు అందరూ కలిసి.. సుశీల్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ దగ్గరకు వచ్చారు. వాచ్ మెన్‌తో మాటలు కలిపి మందుపోయించారు. వాచ్ మెన్ ఫుల్ గా తాగి పడిపోయాడు. ఇదే అదునుగా.. డూప్లికేట్ తాళంతో ఇంట్లోకి ప్రవేశించారు. ఫ్లాట్ లోని ఓ గదిలో నిద్రపోతున్న మూడో భార్య యోగితాపై దాడి చేశారు. కత్తితో పొడిచి చంపేశారు. ఆవేశంలో హత్య అయితే చేశారు.. శవాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. 

తెలివిగా తప్పించామనుకున్నారు:
ఇదే సమయంలో మొదటి భార్య కూతురు.. తన బాయ్ ఫ్రెండ్ నీరజ్ మిశ్రాకి కాల్ చేసింది. వెంటనే రావాలని కోరింది. గార్ల్ ఫ్రెండ్ అంత రిక్వెస్ట్ చేయటంతో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు మిశ్రా. అప్పటికే ఓ దుప్పటలో చుట్టి ఉంచిన యోగితా డెడ్ బాడీని.. బతికే ఉన్నట్లు.. అమ్మ జ్వరంతో బాధపడుతున్నట్లు నమ్మించారు. అందరూ కలిసి యోగిత శవాన్ని.. నీరజ్ మిశ్రాకు చెందిన ఆటో రిక్షాలో చేర్చారు. సిటీలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి చేరుకున్న తర్వాత.. నీరజ్ మిశ్రాను వెళ్లిపోవాలని కోరారు. ఆస్పత్రికి తీసుకెళతాను అని చెప్పిన వినకుండా అతన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. శవాన్ని ఓ డంపింగ్ యార్డులో పడేసి వెళ్లిపోయారు.

నిజం తెలిసిందిలా:
మూడో భార్య యోగితా కనిపించటం లేదని సుశీల్ కంప్లయింట్ చేశాడు. రెండు రోజుల వరకు ఆచూకీ లేదు. మూడో రోజు ఓ శవం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వివరాలన్నీ పరిశీలిస్తే.. సుశీల్ మూడో భార్యగా నిర్ధారించారు. హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. మొదటి ఎవరిపైనా అనుమానం రాలేదు. కుటుంబ సభ్యులపై నిఘా పెట్టిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించే సరికి మొత్తం క్రైం స్టోరీని బయటికొచ్చింది. ఈ విధంగా రెండో భార్య.. మొదటి భార్య పిల్లలతో కలిసి.. మూడో భార్యను చంపేసింది.