Maoist Chalapati : మావోయిస్టు అగ్రనేత చలపతి హతం.. భార్యతో తీసుకున్న సెల్ఫీ వల్ల ప్రాణం పోయిందట..!
Maoist Chalapati : చలపతిపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. చలపతిని భద్రతా దళాలు గుర్తించడానికి కీలక ఆధారం ఒక్కటే.. తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే.

Maoist Chalapati
Maoist Chalapati : చిక్కడు.. దొరకడు అన్నట్టుగా దశాబ్దాలుగా పోలీసు బలగాలను ముప్పుతిప్పలు పెట్టించిన మావోయిస్టు అగ్రనేత చలపతి అలియాస్ జయరాం రెడ్డి చివరికి ఒక సెల్ఫీ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఇన్నాళ్లుగా పోలీసులకు చిక్కని మావోయిస్టు సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడిగా తన ఐడెంటిటీని బయట పడకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ, భార్యతో సెల్ఫీ దిగడమే ఆయన కొంపముంచింది. ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్-ఒడిసా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలపతి హతమయ్యాడు.
ఇటీవల, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సీఆర్పీపీఎఫ్ ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ప్రముఖమైన పేరు జయరాంరెడ్డి. నక్సల్ టాప్ కమాండర్ జైరామ్ అలియాస్ చలపతి కోసం పోలీసులు దశాబ్దాలుగా వెతుకుతున్నారు. అయితే, గతంలో తన భార్య అరుణ అకా చైతన్య వెంకట్ రవితో కలిసి చలపతి సెల్ఫీ దిగాడు. ఈ ఒక్క పొరపాటు ఆయన ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది.
చలపతిపై రూ. కోటి రివార్డు.. :
చలపతిపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. చలపతిని భద్రతా దళాలు గుర్తించడానికి కీలక ఆధారం ఒక్కటే.. తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే. దీని ఆధారంగానే భద్రతా బలగాలు చలపతిని గుర్తించి హతమర్చాయి. 2008 ఫిబ్రవరిలో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో జరిగిన దాడికి చలపతినే సూత్రధారి. ఈ దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న సీనియర్ అధికారి నుంచి అందిన సమాచారం ప్రకారం.. మావోయిస్టులు పోలీసు ఆయుధాలను దోచుకున్నారని, నయాగర్ నుంచి తప్పించుకున్నారు. చలపతి చాలా పక్కాగా దాడికి ప్లాన్ చేశాడు. నగరానికి వెళ్లే అన్ని మార్గాల్లో చెట్లను నరికేశాడు. దీంతో పోలీసులపై దాడి జరుగుతున్న సమయంలో బయటి నుంచి వచ్చిన భద్రతా బలగాలు నయాగర్‌లోకి ప్రవేశించలేకపోయాయి.
పాడుబడిన స్మార్ట్‌ఫోన్‌లో చలపతి సెల్ఫీ :
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నివాసి అయిన చలపతి చాలా సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు. చలపతికి బస్తర్‌లోని దట్టమైన అడవుల గురించి పూర్తిగా తెలుసు. కానీ, ఆంధ్ర ఒడిషా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC) ‘డిప్యూటీ కమాండర్’ ఆయన భార్య అరుణ. ఆమెతో తీసుకున్న సెల్ఫీ అతన్ని గుర్తించడంలో భద్రతా దళాలకు సాయపడింది. మే 2016లో ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత స్వాధీనం చేసుకున్న ఒక పాడుబడిన స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫొటోను గుర్తించారు.
సైనిక వ్యూహాలతో గెరిల్లా యుద్ధంలో నిపుణుడిగా ఉన్నాడని అధికారులు తెలిపారు. 8 నుంచి 10 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బందితో ఎక్కడికో వెళ్లేవాడు. చలపతి మావోయిస్టుల కేంద్ర కమిటీలో సీనియర్ సభ్యుడు. ఆయన ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో చురుకుగా ఉండేవాడు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలతో ఎన్‌కౌంటర్ పెరగడంతో కొన్ని నెలల క్రితం తన లొకేషన్ మార్చుకున్నాడు. సెల్ఫీ కారణంగా చలపతిని ట్రాక్ చేయగలిగారు.
చలపతి ఎవరంటే? :
జయరాంరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నివాసి. ఆయన 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. విద్యార్హత ఉన్నప్పటికీ, తాను మావోయిస్టు శ్రేణులలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీ సభ్యుల కేడర్‌గా మారాడు. నిషేధిత సంస్థ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అతడికి దాదాపు 60 ఏళ్లు ఉంటాయి. కోటి రూపాయల రివార్డు కలిగిన చలపతి భద్రతా దళాలకు ఎంత ముఖ్యమైన టార్గెట్‌గా ఉన్నాడో చెప్పవచ్చు. ఆయన భద్రతా బృందంలో 10 మంది వ్యక్తిగత గార్డులు ఉన్నారంటే నక్సలైట్ నెట్‌వర్క్‌లో ఎంత ముఖ్యమైన వాడో అంచనా వేయవచ్చు. ఏకే-47, ఎస్ఎల్ఆర్ రైఫిల్ వంటి అధునాతన ఆయుధాలను కలిగిన చలపతి, వ్యూహాలను రూపొందించడంలో, కార్యకలాపాలకు నాయకత్వం వహించడంలో కీలక పాత్ర పోషించడంలో దిట్ట కూడా.
Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…
— Amit Shah (@AmitShah) January 21, 2025
నక్సలిజానికి మరో బలమైన దెబ్బ : అమిత్ షా
2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఎన్‌కౌంటర్‌ను “నక్సలిజానికి మరో బలమైన దెబ్బ”గా అభివర్ణించారు. “నక్సల్ రహిత భారత్‌ను నిర్మించడంలో మా భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో CRPF, SoG ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లను మట్టుబెట్టారు” అని అమిత్ షా పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు కనీసం 40 మంది మావోయిస్టులు మరణించారు.