కరోనా వ్యాక్సిన్ అంటూ వృద్ధులకు మత్తు ఇచ్చి బంగారం చోరీ

Woman steals gold Jewelry from Old couple : కరోనా వ్యాక్సిన్ ఇస్తానంటూ వచ్చి ఓ మహిళ వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారంతో పరారైంది. దాదాపు 8 తులాల బంగారు అభరణాలను తీసుకొని పారిపోయింది. కానీ, కేవలం రెండు గంటల్లోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. వృద్ధ దంపతులను నమ్మించి 8 తులాల బంగారు అభరణాలను అపహరించింది. ఈ ఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధితుల వివరాల ప్రకారం.. జిల్లెల గూడ లలితా నగర్ కు చెందిన కుంతాల లక్ష్మణ్ (80), కస్తూరి (70) దంపతులు ఒంటరిగా జీవిస్తున్నారు. వికారాబాద్‌కు చెందిన విజయ్, అనూష (21)లు లక్ష్మణ్ పక్కింట్లో అద్దెకు దిగారు. విజయ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య అనూష మందమల్లమ్మ సమీపంలోని విశ్వాస్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసి మానేసింది. బీఎస్సీ నర్సింగ్ నాల్గో సంవత్సరం చదువుతోంది.
వృద్ధ దంపతుల ఇంట్లో బంగారంపై కన్నేసిన అనూష వారితో పరిచయడం పెంచుకుంది. అమ్మమ్మ, తాతయ్య అంటూ ఆప్యాయతగా మాటలు కలిపింది. అనూషపై మాటలను నమ్మారు. మూడు నెలల క్రితం అనూష ఇంటిని ఖాళీ చేసింది వెళ్లిపోయారు. మరో ఇంట్లో అద్దెకు దిగారు. కస్తూరి మెడలో నగలపై కన్నేసిన అనూష మళ్లీ వారి ఇంటికి వచ్చింది. ప్లాన్ ప్రకారం.. మాటలు కలిపింది. వారికి మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నించింది.
కానీ, అది బెడిసికొట్టింది. ప్రస్తుతం తాను 8వ నెల గర్భవతినంటూ మాట్లాడి మత్తు మందు కలిపిన పాయసం ఇవ్వాలని చూసింది. కానీ వృద్ధ దంపతులు తినలేదు. మరుసటి రోజున మళ్లీ అనూష వచ్చింది. ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నానంటూ నమ్మించింది. కరోనా టీకా వేసేందుకు వచ్చానని చెప్పింది. అది నమ్మిన వృద్ధులు ఇంజెక్షన్ వేయించుకున్నారు. మత్తు ప్రభావంతో వారిద్దరూ స్పృహ కోల్పోయారు.
కస్తూరి ఒంటిపై ఉన్న బంగారు గాజులు, చెవి కమ్మలు, మాటీలు, రెండు ఉంగరాలు, పుస్తెలతాడును దొంగిలించి అనూష పారిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు స్థానికులు, సీసీపుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రెండు గంటల్లో అనూషను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనూషపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.