Punjab: సింహం లాంటి మీ కొడుకుని చంపేశాం.. అతడి పనైపోయింది.. తల్లిదండ్రుల ఎదుటే ఘాతుకం

తల్లిదండ్రులు చూస్తుండగానే ఇంటి ముందే యంగ్ కబడ్డీ ప్లేయర్ ను దారుణంగా హతమార్చిన ఘటన పంజాబ్ లో తీవ్ర కలకలం రేపింది.

Punjab: సింహం లాంటి మీ కొడుకుని చంపేశాం.. అతడి పనైపోయింది.. తల్లిదండ్రుల ఎదుటే ఘాతుకం

Hardeep Singh alias Deepa (Image tweeted by @officeofssbadal)

Punjab- Hardeep Singh : యువ కబడ్డీ ప్లేయర్ ఒకరు పంజాబ్ లో దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు అతడిని సొంత ఇంటి ముందు కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. కపుర్తలాలోని (Kapurthala) ధిల్వాన్ తహసీల్‌లో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. చనిపోయిన వ్యక్తి హర్దీప్ సింగ్ అలియాస్ దీపగా గుర్తించారు. ఈ కేసులో నిందితులను ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదు. ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో పంజాబ్ జంగిల్ రాజ్ గామారిందని ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ (Sukhbir Singh Badal) విమర్శించారు.

అసలేం జరిగింది?
ధిల్వాన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న హర్దీప్ సింగ్ కు తమ ప్రాంతానికే చెందిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీతో చాలా కాలంగా గొడవలున్నాయి. వీరిద్దరూ పరస్పరం ధిల్వాన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టులకు భయపడి తన కుమారుడు ఇంట్లో ఉండడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దీప తండ్రి గుర్నామ్ సింగ్ వెల్లడించారు. అయితే దీపపై దాడి చేయడానికి అదును కోసం చూస్తున్న ప్రత్యర్థులు అతడు ఇంటికి వచ్చాడన్న సమాచారంతో దాడికి తెగపడ్డారు.

బ్యాంకు పాస్‌బుక్ కోసం వచ్చి..
బ్యాంకు పాస్‌బుక్ కోసం తన కుమారుడు ఇంటికి వచ్చాడని గుర్నామ్ సింగ్ తెలిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో తలుపులు బాదుతున్న శబ్దం వినబడటంలో అనుమానం వచ్చి నేను, నా భార్య కలిసి టెర్రస్‌ పైకి వెళ్లి చూశాం. మమ్మల్ని చూడగానే హ్యాపీ, ఐదుగురు వ్యక్తులు గట్టిగా అరుస్తున్నారు. “మీ కొడుకుని చంపేశాం. అతడి పనైపోయింది. ఇడిగో సింహం లాంటి మీ కొడుకు” అంటూ మా ఇంటి ముందే హర్దీప్ ను పడేసి పారిపోయారు. కిందికి వచ్చి తలుపులు తెరిచి చూడగా తీవ్ర గాయాలతో దీప అక్కడ పడివున్నాడు. కత్తులు, కిర్పాన్‌లతో హ్యాపీ గ్యాంగ్ తనను పొడిచారని మాతో దీప చెప్పాడు. జలంధర్‌లోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించార”ని గుర్నామ్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్‌సింగ్ నిజ్జర్‌‌ చరిత్ర తెలిస్తే షాకవుతారు..

నిందితుల కోసం గాలింపు
హ్యాపీ, దీప ఇద్దరిపై చాలా కేసులు ఉన్నాయని ధిల్వాన్ పోలీస్ స్టేషన్‌ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కుల్దీప్ సింగ్ తెలిపారు. దీప తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హ్యపీ, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

Also Read: ఓరి నాయనో.. ఆ జైలులో బిట్‌కాయిన్ మిషన్లు, బకెట్ల కొద్దీ బులెట్లు, మెషీన్ గన్ బులెట్ బెల్టులు ఇంకా మరెన్నో.!

సీఎం తక్షణమే రాజీనామా చేయాలి
పంజాబ్ లో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని, సీఎం భగవంత్ మాన్ గద్దె దిగాలని సుఖ్బీర్ సింగ్ డిమాండ్ చేశారు. హర్దీప్ సింగ్ హత్య షాక్ గురిచేసిందని, తల్లిదండ్రులు చూస్తుండగానే సొంత ఇంటి ముందు అతడిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదెక్కడో నిర్మానుష్య ప్రాంతంలో జరిగిన ఘటన కాదని.. రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, స్నాచింగ్‌లు ,దోపిడీలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన సీఎం భగవంత్ మాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.