ఫోన్ లో నరకం చూపించారు : వేధింపులు భరించలేక లావణ్య ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 03:35 PM IST
ఫోన్ లో నరకం చూపించారు : వేధింపులు భరించలేక లావణ్య ఆత్మహత్య

Updated On : January 30, 2020 / 3:35 PM IST

ఆ యువతి డిగ్రీ పూర్తి చేసింది. మిషన్‌ కుట్టుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. ఆ యువతిపై కీచకుల కన్ను పడింది. ఒకడేమో ప్రేమించాలంటూ వాయిస్‌ మెసేజ్‌లు.. మరొకడేమో పెళ్లి చేసుకోవాలంటూ ఫోన్స్‌. ఇద్దరి నుంచి నిత్యం వేధింపులు. ఇష్టం లేదని చెప్పినా వినలేదు. తల్లిదండ్రులతో చెప్పించినా మానలేదు. ఫోన్స్‌, మెసేజ్‌లతలో నరకం చూపించారు. టార్చర్‌ పెట్టారు. ఆ వేధింపులు భరించలేని యువతి బతకడం వృధా అనుకుని తనువు చాలించింది.

యువతి ప్రాణం తీసిన వేధింపులు:
ప్రేమ..ఆ యువతి పాలిట శాపంగా మారింది. బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. ఓ కుటుంబానికి తీరాని శోకాన్ని మిగిల్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఇద్దరు యువకులు పెట్టిన టార్చర్‌కు ఓ యువతి తనువు చాలించింది. ఆ వేధింపులు భరించడం నా వల్ల కాదంటూ చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోయింది. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామనుకున్న తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చి వెళ్లింది. కిరోసిన్‌ పోసుకుని ప్రాణాలు తీసుకుంది. రాజన్న సిరిసిల్లా జిల్లాలో వెలుగులోకి వచ్చిన కలకలం రేపింది.

ప్రేమ పేరుతో చంపేస్తున్నారు:
అమ్మాయి కనిపిస్తే చాలు ప్రేమ పేరుతో వెంటపడటం యువకులకు ఫ్యాషన్‌ అయిపోయింది. ముందుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడతారు. నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం, నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం, అవసరమైతే ప్రాణాలిస్తాం అంటారు. వారి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా వేధిస్తారు. అమ్మాయి తిరస్కరిస్తే మాత్రం సైకోలా ప్రవర్తిస్తారు. ప్రాణం తీస్తున్నారు. ప్రాణం తీసుకునేలా చేస్తున్నారు. గంగరావుపేట మండలం గజసింగవరంలో ఇద్దరు యువకులు వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. 

ప్రేమ పేరుతో ఒకడు.. పెళ్లి పేరుతో మరొకడు:
గజసింగవరంకు చెందిన లావణ్య…డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గరే మిషన్‌ కుట్టుకుంటూ ఉండేది. గత కొద్ది కాలంగా రవి అనే యువకుడు..ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. ప్రేమించాలంటూ టార్చర్‌ చేసేవాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీకాంత్‌ అనే పెళ్లైన మరో యువకుడు కూడా వేధింపులకు దిగాడు. ఒకరు వాయిస్‌ మెసేజ్‌లు పంపుతూ..మరొకరు ఫోన్ కాల్స్‌ చేస్తే నిత్యం టార్చర్‌ చేసేవారు. వేధింపులు ఎక్కువవడంతో యువతి తల్లిదండ్రులు రవి ఇంటికి వెళ్లి నిలదీశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. వేధింపులను కొనసాగిస్తూ వచ్చాడు. నాతో మాట్లాడకపోతే నీ అంతు చూస్తా…ఫోన్‌ నెంబర్‌ అందరికి ఇచ్చి టార్చర్‌ పెట్టిస్తానంటూ ఫోన్‌ చేస్తూ బెదిరించేవాడు. 

ఇలా ఇద్దరు కలిసి మెసేజ్‌, ఫోన్స్‌ ద్వారా చిత్రహింసలు పెట్టేవారు. రోజురోజుకు ఆ వేధింపులు ఎక్కువడంతో బాధిత యువతి మనస్థాపానికి గురైంది. ప్రేమ పేరుతో వేధించిన రవిని కఠినంగా శిక్షించాలంటూ లెటర్‌ రాసి…ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కిరోసిన్‌ పోసి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కొల్పోయింది. అంతకుముందు మృతురాలు లావణ్య…ఇద్దరు యువకులు శ్రీకాంత్, రవి ఫోన్ చేసి ప్రేమ పేరుతో వేధిస్తున్నారంటూ మరణ వాంగ్మూలం ఇచ్చింది. వారి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని తెలిపింది. మృతురాలి మరణ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. మరోవైపు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్‌ చేశారు.