విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ : టీచర్ల నియామకాలకు జిల్లాస్థాయి కమిటీల ఏర్పాటు

హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో అర్హత కలిగిన వారికి ఉపాధ్యాయ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ఆమోదం కోసం ఫైల్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీంతో వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, నియామకాల ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఫైలుపై ఫిబ్రవరి 21 గురువారం సంతకం చేశారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సంతకం చేసిన తొలి ఫైలు ఇదే కావడం గమనార్హం.
ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ నుంచి 2 వేల వరకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అభ్యర్థుల జాబితా విద్యాశాఖకు అందింది. వీటిలో 900 వరకు ఇంగ్లిష్ మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉండగా, మిగతావి స్కూల్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు ఎంపికైన వారి జాబితా ఉంది. ఇక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు యూనిఫారాలు అందించే ఫైలుపైనా జగదీశ్ రెడ్డి సంతకం చేశారు. రూ.74.01 కోట్లు వెచ్చించి విద్యాశాఖ విద్యార్థులకు యూనిఫారాలు అందించనుంది.
మరోవైపు 84 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో (కేజీబీవీ) వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతి ప్రారంభించేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 88 కేజీబీవీలలో ఇంటర్మీడియట్ వరకు విద్యను ప్రభుత్వం అందిస్తోంది. మరో 303 కేజీబీవీలలో 10వ తరగతి వరకు విద్య బోధనను అందిస్తోంది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 84 కేజీబీవీలలో 9వ తరగతి వరకు విద్యను అందించనుంది. కేజీబీవీలను ప్రారంభించిన కొద్దీ ప్రభుత్వం ఏటా ఒక్కో తరగతిని పెంచుతూపోతోంది.