హాల్ టికెట్లకు కూడా : ఓయూ కాలేజీలకు జియో ట్యాగింగ్

  • Published By: chvmurthy ,Published On : February 11, 2019 / 04:48 AM IST
హాల్ టికెట్లకు కూడా : ఓయూ కాలేజీలకు జియో ట్యాగింగ్

హైదరాబాద్:  ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్నీ డిగ్రీ పరీక్షా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. వీటిని హాల్ టికెట్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఎగ్జామ్స్ అప్పుడు టైం సేవ్ అవుతుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీ రిజిష్ట్రార్లు,  హైదరాబాద్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు ఇటీవల జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ఓయూ సెమిస్టర్ పరీక్షల్లో డిగ్రీ విద్యార్ధికి దిల్ షుక్ నగర్ లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో పరీక్షా కేంద్ర కేటాయించారు. ఆ కాలేజీ.. మేడ్చల్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తోంది. దిల్ షుక్ నగర్  వెళ్లిన విద్యార్ధి తిరిగి మేడ్చల్ వెళ్లాలంటే అయ్యే పనికాదు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఒకే పేరుతో వివిధ క్యాంపస్ లు నిర్వహిస్తున్నాయి. వీటి వల్ల విద్యార్ధులు గందరగోళానికి గురవుతున్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవుతున్నారు. దీన్నినివారించాలంటే జియో ట్యాగింగ్ ఒక్కటే మార్గమని యూనివర్సిటీ అధికారులు  తెలిపారు. 

ఓయూకి అనుంబంధంగా  434 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 200 కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు. కాలేజీల్లో విద్యా ప్రమాణాలతో పాటు జియో ట్యాగింగ్ చేసిన ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు మాత్రమే ప్రవేశాలకు అనుమతి ఇవ్వనున్నారు.  జియో ట్యాగింగ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కూడా ప్రకటించాయి. దీని వల్ల కాలేజీ యాజమాన్యాలు క్యాంపస్ లను వేరే చోటకి మార్చే అవకాశం ఉండదు. 

కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు.. ఇతర యూనివర్సిటీలకు సంబంధించి దూరవిద్య కోర్సులు నిర్వహిస్తున్నాయి. వీటిలో పరీక్షల సమయంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఇలాంటి కళాశాలల గుర్తింపు రద్దు చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాలేజీలను జియో ట్యాంగింగ్ చేయడం వలన విద్యార్ధులకే కాక యూనివర్సిటీ అధికారులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కాలేజీలను తనిఖీలు చేయటానికి సులువుగా ఉంటుందని యూనివర్సిటీ అధికారి ఒకరు చెప్పారు.