ఇంటర్ గందరగోళం : గ్లోబరీనా మోసాలు

  • Published By: madhu ,Published On : April 26, 2019 / 12:54 AM IST
ఇంటర్ గందరగోళం : గ్లోబరీనా మోసాలు

Updated On : April 26, 2019 / 12:54 AM IST

ఇంటర్ ఫలితాల గందరగోళానికి కారణమైన గ్లోబరీనా చుట్టూ ఉచ్చు బిగుస్తోందా… డేటా సేకరణ మొదలు ఫలితాల వెల్లడి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న టెక్నాలజీ సంస్థ పైన టీ సర్కార్ చర్యలకు సిద్ధమవుతోందా…పరిణామాలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డేటా, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌లో అనేక అవకతవకల కారణంగా ఇంటర్మీడియట్‌ ఫలితాల గందరగోళంలో గ్లోబరీనా సంస్థదే ప్రధాన పాత్ర. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ ప్రతి దాంట్లో ఈ సంస్థ చాలా నిర్లక్ష్యంగా ఉందని క్లియర్‌గా అర్ధమవుతోంది. అందుకే లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల తారుమారుతో రోడ్డెక్కారు. 

DPRP ప్రాజెక్టు టెండర్‌ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ….ఇంటర్‌ విద్యార్థుల అడ్మిషన్ల నుంచి పరీక్షా ఫలితాలు ఇచ్చే వరకు బాధ్యతలు నిర్వహించాలి. కానీ 2018-19 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన ప్రారంభంలోనే గందరగోళానికి గురై చేతులెత్తేసింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి డేటా ప్రాసెస్‌ చేసింది. వారం రోజుల్లో దాదాపు 70వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడంతో ఆయా విద్యార్థుల వివరాలన్నీ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాలి. కానీ ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ప్రాసెస్‌ చేసిన విద్యార్థుల డేటా మొత్తం కరప్ట్‌ అయ్యింది. ఆ తర్వాత మాన్యువల్‌ పద్ధతిలో కాలేజీల వారీగా వివరాలను ఆన్‌లైన్‌ చేయడంతో అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. 

దీన్ని చక్కదిద్దేందుకు CGGని రంగంలోకి దింపింది ప్రభుత్వం. డేటా ప్రాసెసింగ్‌లో అనుభవమున్న సిజీజీ ఈ ప్రక్రియను చాలా ఈజీగా పూర్తి చేసింది. అయితే మొత్తం వివాదాన్ని క్లియర్‌ చేసి ఇచ్చిన తర్వాత స్వల్ప మార్పులు, చేర్పులు చేసే పని మాత్రమే గ్లోబరీనాకు మిగిలింది. అయితే ఆ పని కూడా సరిగ్గా నిర్వహించలేక అందులో కూడా అనేక తప్పులు చేస్తూ పోయింది. దీంతో పరీక్షల సమయంలో ఓఎంఆర్ షీట్లు తారుమారు కావడంతో గందరగోళ పరిస్థితులకు కారణమైంది. అంతేకాదు ఇంటర్ విద్యార్ధుల పరీక్షా ఫీజుల చెల్లింపుల విషయం…చివరకు ఫలితాల్లో కూడా నిర్లక్ష్యం వహిస్తునే వచ్చింది. 

గతంలో కూడా గ్లోబరీనా అవకతవకలకు పాల్పడింది. 2017లో కాకినాడ సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో గ్లోబరీనాపై కేసు నమోదైంది. కాకినాడ జేఎన్టీయూలో ఈ లెర్నింగ్, ఈ కంటెంట్ టెండర్లలో గ్లోబరీనా మోసాలకు పాల్పడింది. మొత్తం 36 కోట్ల ఒప్పందంతో టెండర్‌ దక్కించుకున్న సంస్థ 26 కోట్ల అవినీతికి పాల్పడిందని జేన్టీయూ కాకినాడ రిజస్ట్రార్ స్వయంగా వెళ్లి కంప్లైంట్ చేశారు. మొత్తంగా అడుగడుగునా నిర్లక్ష్యం వహించిన గ్లోబరినా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తోంది.