అమ్మానాన్న కలెక్టర్ హోదా.. కొడుకు మాత్రం అంగన్ వాడీ చదువు

  • Published By: venkaiahnaidu ,Published On : January 30, 2019 / 04:23 AM IST
అమ్మానాన్న కలెక్టర్ హోదా.. కొడుకు మాత్రం అంగన్ వాడీ  చదువు

Updated On : January 30, 2019 / 4:23 AM IST

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సాధ్యమైనంతవరకు ప్రైవేట్ స్కూళ్లకు పంపించేందుకు మొగ్గు చూపుతుండటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఎల్ కేజీ నుంచి లక్షల రూపాయల ఫీజులు కట్టి తమ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం మా పిల్లల్ని పంపించలేమంటూ కొందరు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు ఉండవు. అక్కడ టీచర్లు ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళతారో ఎవరికీ తెలియదు అంటూ కొంతమంది దాపరికం లేకుండా చెప్పేస్తారు.

మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపిద్దామని చెప్పే ప్రజాప్రతినిధులు వారి పిల్లల్ని అమెరికా, లండన్ వంటి విదేశాల్లో కోట్ల రూపాయల ఫీజులు కట్టి చదివించడం మనం చూస్తున్నాం. అయితే ఓ ఐఏఎస్ మాత్రం వీరిందరికి భిన్నంగా తన కుమారుడిని గవర్నమెంట్ రన్ చేస్తున్న అంగన్ వాడీ కేంద్రంలో చదివిస్తూ అందరికీ ఆధర్శంగా నిలుస్తదున్నారు. ప్రభుత్వ విద్యాలయాలు మరింత అభివృద్ధి చెందాలంటే మన నుంచే మార్పు మొదలవ్వాలంటూ ఆ ఐఏఎస్ చూపించిన చొరవను అందరూ మెచ్చుకుంటున్నారు. 

ఐఏఎస్ అధికారి తేటి శివశంకర్..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా(పీవో) విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి లక్ష్మి ఐడబ్ల్యూఎంపీ ఏపీడీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. రెండో కుమారుడైన సోహమ్ నందన్(3)ను ఈ ఏడాది అంగన్ వాడీలో సెంటర్ లో  చేర్పించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అంగన్ వాడీలోనే తోటి విద్యార్థులతో కలిసి సోహమ్ ఉంటాడు. అందరితో కలిసి భోజనం చేస్తేూ సోహమ్ ఉల్లాసంగా గడుపుతాడని, ప్రతి రోజూ క్రమం తప్పకుండా సోహమ్ అంగన్ వాడీకి వస్తాడని అంగన్ వాడీ కార్యకర్త ఉషారాణి తెలిపారు.

అయితే ప్రభుత్వ విద్యాలయాల ప్రోత్సాహానికి శివశంకర్ దంపతుల చొరవ పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా కేవలం మాటలు చెప్పడం కాకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపి ఆదర్శంగా నిలవాలంటున్నారు. ప్రజాప్రతినిధుల పిల్లలందరూ ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనే నిబంధనను తీసుకొచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.