IBPS Recruitment 2025 : డిగ్రీ కంప్లీటైన వారికి శుభవార్త.. ఇంకా మూడ్రోజులే గడువు.. 10,277 క్లర్క్ పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. భారీగా వేతనం
IBPS Recruitment 2025 : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి భారీ శుభవార్త. IBPS 10,277 క్లర్క్ పోస్టులను

IBPS Recruitment 2025
IBPS Recruitment 2025 : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి భారీ శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ గడువును తాజా పెంచింది. (IBPS Recruitment 2025)
దరఖాస్తు గడువు పెంపు..
10,277 క్లర్క్ (కస్టమర్ సర్వీస్ అసోసియేట్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని IBPS పొడిగించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆగస్టు 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు అవకాశం ఉంది. అయితే, ఇటీవల దరఖాస్తు గడువు తేదీని ఐబీపీఎస్ ఆగస్టు 28వ తేదీ వరకు పొడిగించింది. అయితే, దరఖాస్తుకు గడువు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.
ఏపీ, తెలంగాణలో పోస్టుల వివరాలు..
దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్ పోస్టులు ఉండగా.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1315, మహారాష్ట్రలో 1117, తమిళనాడులో 894, కర్ణాటకలో 1170, గుజరాత్ రాష్ట్రంలో 753, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 601 పోస్టులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో 261, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 367 పోస్టులు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో 500కు తక్కువ పోస్టులు ఉన్నాయి.
వయస్సు.. అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అంతేకాక స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అయితే, ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం.. ఫీజు వివరాలు..
ఈ క్లర్క్ పోస్టులకు ఆగస్టు 28వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175, ఇతరులకు రూ.850. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రిలిమినరీ, మెయిన్స్, స్థానిక భాష పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు అప్లికేషన్ సమయంలో పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
జీతం ఎంత?
ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల్లో అర్హత సాధించిన వారికి నెలకు వేతనం రూ.24,050 ఉంటుంది. అనుభవం, పదోన్నతిని భట్టి నెలకు గరిష్ఠంగా రూ.65,480 వరకు వేతనం లభిస్తుంది. దీనితోపాటు క్లర్క్ కు DA, HRA, ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. కాబట్టి, చేతికొచ్చే మొత్తం జీతం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
♦ ముందుగా IBPS అధికారిక వెబ్ సైట్ www.ibps.in కి వెల్లండి.
♦ హోమ్ పేజీలో IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 లేదా CRP క్లర్క్-XV కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు లింక్‌ను ఓపెన్ చేసి క్లిక్ చేయండి.
♦ న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీరు పేరు, మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ తదితర వివరాలను పూరించండి.
♦ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్ వర్డ్ అందుతాయి.
♦ లాగిన్ అయ్యి మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత, చిరునామా, ఇతర అవసరమైన సమాచారాన్ని పూరించండి.
♦ సూచించిన ఫార్మాట్ సైజులో పాస్‌పోర్టు సైజు ఫొటోల, సంతకం, ఎడమ బొటనవేలు ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయండి.
♦ మీ కేటగిరీ ప్రకారం ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి.
♦ ప్రతిదీ జాగ్రత్తగా తనిఖీ చేసి ఆ తరువాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి.