UPSC Beerappa Siddappa : గొర్రెల కాపరి కొడుకు సక్సెస్ స్టోరీ.. యూపీఎస్సీలో 551వ ర్యాంకు.. IPS కాబోతున్న బీరప్ప సిద్దప్ప ఎవరంటే?
UPSC Beerappa Siddappa : ఇండియా పోస్ట్‌లో ఉద్యోగం మానేసి యూపీఎస్సీ కోసం ప్రిపేయర్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో పాస్ అయ్యాడు. బీరప్ప సిద్ధప్ప డోని కుటంబం, అతడి గ్రామం సంబరాలు చేసుకుంటున్నారు.

UPSC Beerappa Siddappa
UPSC Beerappa Siddappa : సక్సెస్ ఎవరి సొత్తు కాదు.. కష్టపడాలనే కసి.. నిరంతర పట్టుదల, అలుపెరగని శ్రమ చేయగల నేర్పు ఉంటే చాలు.. ఎంతటి కష్టమైనది కూడా సాధించవచ్చు అంటారు. ఇప్పుడు ఇది అక్షరాలా నిజం చేశాడు ఓ గొర్రెల కాపరి కొడుకు. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షలో 551వ ర్యాంకు సాధించాడు. అతి త్వరలోనే ఐపీఎస్ అధికారి కాబోతున్నాడు.
ఇటీవలే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ప్రతి ఏడాదిలో యూపీఎస్సీ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారు. కానీ, కొద్దిమంది అభ్యర్థులు మాత్రమే యూపీఎస్సీలో ఉత్తీర్ణులవుతారు. సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఒక గొర్రెల కాపరి సామాజిక వర్గానికి చెందిన కొడుకు యూపీఎస్సీ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అమ్గే గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ శుభవార్త తెలియగానే సిద్ధప్ప గ్రామంలో సంబరాలు మొదలయ్యాయి.
ఇది కేవలం ఒక యువకుడి విజయం మాత్రమే కాదు.. కుటుంబం, ఆ గ్రామంలోని వారిది కూడా. గొర్రెలతో తన జీవితాన్ని గడిపే ఈ సాధారణ యువకుడు యూపీఎస్సీ CSE 2024లో 551వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించాడు. కష్టపడే తత్వం ఉండాలే కానీ, సాధ్యకానిది అంటూ ఏది ఉండదని బీరప్ప నిరూపించాడు.
సెలవుల మీద తన బంధువుల ఇంటికి వెళ్లిన బీరప్ప సిద్ధప్ప.. బెళగావి సమీపంలోని నానావాడిలోని ఒక పొలంలో గొర్రెలను మేపుతున్న సమయంలో ఈ శుభవార్త అందుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్వయంగా ఫోన్ చేసి బీరప్పను అభినందించారు.
గొర్రెపిల్లను బహుమతిగా :
ఆయన తండ్రి సిద్ధప్ప, తల్లి బాలవ్వ, ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు సాంప్రదాయ హారతి ఇచ్చి, పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబం ఆయనకు ఒక గొర్రె పిల్లను కూడా బహుమతిగా ఇచ్చింది. ఐపీఎస్ అధికారి కావాలనే తన ఆశయాన్ని బీరప్ప ఆనందంతో వ్యక్తం చేశారు.
బీరప్ప ఒక సాధారణ గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించాడు. అతనికి కుల దేవత పేరు పెట్టారు. బీరప్ప ఇంజనీరింగ్ పూర్తి చేసి బి.టెక్ డిగ్రీ పొందాడు. తన అన్నయ్య లాగా భారత సైన్యంలో అధికారి కావాలనేది అతని కల. కానీ, పరిస్థితుల కారణంగా ఆ దిశగా ముందుకు సాగలేకపోయాడు. కొంతకాలం ఇండియా పోస్ట్‌లో కూడా పనిచేశాడు. కానీ, సివిల్స్ రాయాలనేది అతడి లక్ష్యం.
యూపీఎస్సీ కోసం ప్రిపరేషన్ :
ఇండియా పోస్ట్‌లో ఉద్యోగం మానేసిన తర్వాత బీరప్ప పూర్తిగా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యాడు. అయితే, మొదటి రెండు ప్రయత్నాలలో యూపీఎస్సీలో విజయం సాధించలేదు. అయినా తన పట్టుదల వదులుకోలేదు. మూడో ప్రయత్నంలో బీరప్ప 551వ ర్యాంకుతో తన కుటుంబానికి, గ్రామానికి, సామాజిక వర్గానికి కీర్తిని తెచ్చిపెట్టాడు. అయితే, తన దరఖాస్తులో ఐపీఎస్ కావాలనేది తన కలగా పేర్కొన్నాడు.
నా కొడుకు పెద్ద పోలీసు అవుతాడు :
బీరప్ప తండ్రి సిద్దప్ప డోనికి యూపీఎస్సీ పరీక్ష గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, తన కొడుకు మీద పూర్తి నమ్మకం ఉంది. నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని జనాలు అంటున్నారు’ అని ఆనందం వ్యక్తం చేశాడు. యూపీఎస్సీ కోసం చాలా కష్టపడ్డాడు. బీరప్ప సిద్ధప్ప సాధించిన ఈ విజయంతో తమ సమాజంలోని యువత ముందుకు ఆదర్శంగా నిలిచాడని బీరప్ప మామ యల్లప్ప కూడా సంతోషం వ్యక్తం చేశారు.
హనుమంతప్ప యల్లప్పకు 910వ ర్యాంకు :
మరోవైపు.. కర్ణాటక సరిహద్దు అవతల ఉన్న మరో గ్రామ నివాసితులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. బెళగావిలోని కోడ్లివాడ్‌కు చెందిన మరో గొర్రెల కాపరి కుమారుడు హనుమంతప్ప యల్లప్ప నంది 910వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. యూపీఎస్సీ పరీక్షలో అన్ని అడ్డంకులను అధిగమించి ఉత్తీర్ణత సాధించాడు. దాంతో అతడి తండ్రి యల్లప్ప, తల్లి కలవ్వ, భార్య యశోధ, సోదరుడు ఆనంద్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు కూడా గర్వపడుతున్నారు.
హనుమంతుడు స్వగ్రామమైన కోడ్లివాడ్‌లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 7 తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత సత్తిగేరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి నుంచి 10 తరగతి పూర్తి చేశాడు. హనుమంతప్ప ధార్వాడ్‌లోని కర్ణాటక కాలేజీలో PUC పూర్తిచేశాడు. ఆపై బెళగావిలోని గోగ్టే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GIT) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో BE ఉత్తీర్ణుడయ్యాడు.