టి.ఎంసెట్ కౌన్సెలింగ్ లో మార్పులు, వెబ్ ఆప్షన్ల నమోదు వాయిదా

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 06:34 AM IST
టి.ఎంసెట్ కౌన్సెలింగ్ లో మార్పులు, వెబ్ ఆప్షన్ల నమోదు వాయిదా

Updated On : October 12, 2020 / 1:47 PM IST

Telangana EAMCET 2020 : తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో స్వల్ప మార్పులు చేశారు. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం జరగాల్సిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు.



ఈ మేరకు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ స్పష్టం చేశారు. మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జరగాల్సిన వెబ్‌ ఆప్షన్ల నమోదును…. నాలుగు రోజులకు కుదించారు. ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఇంజనీరింగ్‌ మొదటి విడత అలాట్‌మెంట్‌ను 24కు వాయిదా వేశారు.



అయితే ధృవపత్రాల పరిశీలన మాత్రం సోమవారం నుంచి ఈనెల 20 వరకు యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. ఇందుకోసం ఇప్పటి వరకు 35వేల 824 మంది విద్యార్థులు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు.



ఇటీవలే తెలంగాణ ఎంసెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. యశ్వంత్ సాయి సెకండ్ ర్యాక్, మణివెంకట కృష్ణ థర్డ్ ర్యాంకు సాధించారు.



కానీ.. గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో మళ్లీ అవకతవకలు జరిగాయి. ఎంసెట్‌లో కటాఫ్‌ మార్కులు వచ్చినా.. ఇంటర్‌లో అన్ని సబ్జెక్టుల్లో పాసైనా.. రిజల్ట్‌లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ ఫలితం చూపించింది.
12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. (దీనిని వాయిదా వేశారు).



22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు.
29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది.
30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు.



అక్టోబర్ 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయిస్తామని కన్వీనర్ వివరించారు. స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.