Summer Holidays : విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఈసారి భారీగా హాలీడేస్
Summer Holidays : విద్యార్థులకి వేసవి సెలవులపై తెలంగాణ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది. సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయంటే..
telangana school summer holidays from 2026 april 24
- తెలంగాణ విద్యార్థులకి శుభవార్త
- వేసవి సెలవులపై అధికారిక ప్రకటన
- ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు
TG Summer Holidays : ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే 1-9 వరకు విద్యార్థులకు పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది. వేసవి సెలవులపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈసారి విద్యార్థులకు భారీగా వేసవి సెలవులు రాబోతున్నాయి.
Also Read: ఇంటర్ ఫలితాలు కాస్త ఆలస్యం.. కారణాలు ఇవే.. ఎప్పుడు ప్రకటిస్తారంటే?
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బళ్లకు.. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు మొదలవుతాయి. అంటే ఏప్రిల్ 23 పాఠశాలలకు చివరి పని దినం. ఆ రోజు నాటికి 1-9వ తరగతి విద్యార్థులకి పరీక్షలు పూర్తి చేసి.. వారికి ప్రోగ్రెస్ కార్డులను కూడా అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలానే ఈ విద్యా సంవత్సరం చివరి పని దినం అయిన ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 11వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం అనగా 2026-27 అకాడమిక్ ఇయర్.. జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో సెలవుల ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే వేసవి సెలవులపై అధికారిక ప్రకటన రావడంతో.. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వాళ్లు బస్సు, రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. పరీక్షలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఇంకా సిలబస్ పూర్తి కాకపోతే.. వారానికి ఒకసారి అదనపు క్లాసులు నిర్వహించి.. సిలబస్ ని పూర్తి చేయాలని ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
