Assembly Elections 2023: 25 మంది పోలీస్ బాస్‌లపై బదిలీ వేటు.. అసెంబ్లీ ఎన్నికల వేళ దూకుడుగా ఈసీ
తెలంగాణలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్‌క్యాడర్ పోలీసు అధికారులే

Assembly Elections 2023: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. బుధవారం (అక్టోబర్ 11) ఒక్కరోజే 25 మంది పోలీసు కమీషనర్లు, ఎస్పీలను బదిలీ చేసింది. తొమ్మిది మంది జిల్లాల మేజిస్ట్రేట్‌లు, నలుగురు కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో సహా పలువురు పోలీసు, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు బదిలీ ఉత్తర్వులు అందాయి.
పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చర్యలు
అక్రమ మద్యం సరఫరాతో సహా అనేక కేసులలో, కొంతమంది అధికారుల పనిలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించినందున వారిపై వేటు పడిందని సమీక్షా సమావేశంలో ఎన్నికల కమీషనర్ పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులను వెంటనే తమ జూనియర్లకు బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాలకు సూచనలు చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాంలలో నవంబర్ 7 నుంచి 30 మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 న జరుగుతుంది.
ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగిన సమీక్షా సమావేశాల్లో ఎన్నికల ప్రక్రియలో లంచగొండితనంపై నిఘా ఉంచాలని ఎన్నికల సంఘం ఈడీని, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. రాష్ట్రాల్లో మద్యం, నగదు పంపిణీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
రాజస్థాన్‌లో ఈ జిల్లాల ఎస్పీలను మార్చారు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా, పంజాబ్‌ల నుంచి అక్రమ మద్యం హనుమాన్‌గఢ్, చురు, జుంజును, అల్వార్ జిల్లాల మీదుగా రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తోంది. హనుమాన్‌గఢ్, చురు, భివాడికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అల్వార్ జిల్లా ఎన్నికల అధికారిలను బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది.
తెలంగాణలో 13 మంది పోలీసు అధికారులు బదిలీ
రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్‌క్యాడర్ పోలీసు అధికారులేనని ఆయన అన్నారు.
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేశామని.. తెలంగాణలో కూడా నలుగురు డీఈఓలను పనితీరు ఆధారంగానే బదిలీ చేశామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు.
BSF, అస్సాం రైఫిల్స్ నిఘా
ఎన్నికల సందర్భంగా ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. మిజోరాం, రాజస్థాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని BSF, అస్సాం రైఫిల్స్‌తో సహా పలు భద్రతా సంస్థలకు ఆదేశాలు అందాయి.