Karnataka Polls: హంగ్‭పై కుమారస్వామి ఓవర్ కాన్ఫిడెన్స్.. ఫలితాలు రాకముందే కాంగ్రెస్, బీజేపీలకు సైగలు

గతంలో భారతీయ జనతా పార్టీతో ఒకసారి, కాంగ్రెస్ పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కుమారస్వామి. 2006లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు

Karnataka Polls: హంగ్‭పై కుమారస్వామి ఓవర్ కాన్ఫిడెన్స్.. ఫలితాలు రాకముందే కాంగ్రెస్, బీజేపీలకు సైగలు

Updated On : May 13, 2023 / 10:30 AM IST

HD Kumaraswamy: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ఫలితాలపై బుధవారం పోలింగ్ ముగియగానే వివిధ సర్వే సంస్థల వెల్లడించిన అంచనాల ప్రకారం.. కొన్ని కాంగ్రెస్ పార్టీ(congress party)కి అధికారం కట్టబెట్టగా, మరికొన్ని బీజేపీ (bjp) వైపు మొగ్గుచూపాయి. అయితే కొన్ని సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేశాయి. ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా.. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో కింగ్‭మేకర్(Kingmaker)‭గా ఉన్న జేడీఎస్(JDS).. ఈసారి కూడా కింగ్‭మేకర్‭గా చక్రం తిప్పడానికి సిద్ధమైంది. ఒకరంగా చెప్పాలంటూ తుది ఫలితాలు రాకముందు హంగ్ అసెంబ్లీ మీద కుమారస్వామి (HD Kumara Swamy) ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. ఎంతలా అంటే.. అప్పుడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పొత్తుకు సంబంధించిన చర్చలకు సైగలు చేస్తున్నారు.

Karnataka Polls: మీకు తెలుసా, కర్ణాటకలో 1999 నుంచి కాంగ్రెసే టాప్. అయినా కూడా..?

కాంగ్రెస్‌ పార్టీ కాస్త ముందంజలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 113 మంది ఎమ్మెల్యేల మద్దతు రాకపోవచ్చునని అనే అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ మూడు అంకెల మార్కుకు అటు ఇటుగా ఫలితాలు రావొచ్చని అంటున్నాయి. ఇదే సమయంలో జేడీఎస్‌ పార్టీకి 30 స్థానాల వరకు లభిస్తాయని చెప్తున్నాయి. అంటే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అటు కాంగ్రెస్ అయినా, ఇటు బీజేపీ అయినా తప్పనిసరిగా జేడీఎస్‌ను మచ్చిక చేసుకోక తప్పదు.

Maharashtra Politics: షిండే కలలో కూడా ఆ పని చేయడు.. ఉద్ధవ్ వ్యాఖ్యలకు పవార్ కౌంటర్

ఈ నేపథ్యంలో జేడీఎస్ అగ్ర నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి స్పందిస్తూ ‘‘జేడీఎస్ కనీసం 50 స్థానాల్లో గెలుస్తుందని నేను ఇప్పటికీ ధీమాగా ఉన్నాను. నా మాటలకు అంగీకారం తెలిపే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. ఇక జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవె గౌడ (HD Deve Gauda) స్పందిస్తూ.. కాంగ్రెస్‌తో జేడీఎస్ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలు ఆ పార్టీకి రాలేదు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వం కొనసాగిన ఏడాది కాలం అనంతరం.. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఓ సంవత్సరం తర్వాత కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికలపై కాంగ్రెస్ విమర్శలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం

వాస్తవానికి ఈ ఎన్నికల్లో తామే ‘కింగ్’ అంటూ ఎన్నికల ప్రచారంలో కుమార స్వామి చెప్పుకొచ్చారు. పోలింగ్ రోజైన మే 10 వరకు దాదాపు అదే మాట చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఆయన మాట మార్చారు. తమ పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి ఉండాల్సిందని, కనీస ఖర్చులకు డబ్బులు లేక సులభంగా గెలిచే స్థానాలను కోల్పోయామని అన్నారు. అంటే తమ పార్టీ మూడు పదుల స్థానాలకు అటుఇటుగానే గెలుస్తుందని కుమారస్వామి ఒప్పుకున్నారు. అందుకే కింగ్ నుంచి కింగ్‭మేకర్‭ స్థాయికి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు పొత్తు కోసం సంకేతాలు చేస్తున్నారు.

Karnataka Congress: కర్ణాటకలో కాంగ్రెస్‌కు సరికొత్త ఉత్సాహం.. ఎందుకో తెలుసా?

గతంలో భారతీయ జనతా పార్టీతో ఒకసారి, కాంగ్రెస్ పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కుమారస్వామి. 2006లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే తమకు లేదని కాంగ్రెస్, బీజేపీలు కుండబద్దలు కొడుతున్నాయి. బీజేపీ నేత శోభ కరంద్లజే ఇటీవల మాట్లాడుతూ, తమకు పొత్తులు పెట్టుకోవలసిన అవసరం రాదని, తమకే సొంతంగా ఆధిక్యత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివ కుమార్ (DK Shivakumar) మాట్లాడుతూ, తమకు 150కి పైగా స్థానాలు లభిస్తాయని, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.