Cm KCR Public Meeting: నల్గొండపై తాను రాసిన పాట గురించి చెప్పిన కేసీఆర్

కేసీఆర్ కంటే ముందు చాలా మందే ముఖ్యమంత్రులు అయ్యారు. అయినప్పటికీ మునుగోడు నీళ్ల గోస తీరలేదు. ఇదే నల్లగొండ జిల్లా బిడ్డ దుశ్చర్ల సత్యనారాయణ, తన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లోరైడ్ మీద పోరాటం చేశారు. ఈ క్రమంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి అనే వ్యక్తిని ఢిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధాని వాజిపేయి టేబుల్ మీద పెట్టి ‘అయ్యా ఇది మా బతుకు’ అని వేడుకున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. నల్గొండ ఫ్లోరైడ్ ఎగ్జిబిషన్ అయింది కానీ, సమస్య పరిష్కారం కాలేదు

Cm KCR Public Meeting: నల్గొండపై తాను రాసిన పాట గురించి చెప్పిన కేసీఆర్

I wrote song on nalgonda fluoride says kcr at munugode public meeting

Cm KCR Public Meeting: నల్గొండ జిల్లాపై తాను రాసిన పాట గురించి కేసీఆర్ ప్రస్తావించారు. ‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ’ అంటూ కొన్ని వాక్యాలు సభలో వినిపించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా చండూరులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే విషయాన్ని చండూరు సభలో కేసీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘టీఆర్ఎస్ కొద్ది రోజుల క్రితం వచ్చింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ దేశాన్ని ఎప్పటి నుంచో ఏలుతున్నాయి. ఆ పార్టీల నుంచి కేసీఆర్ కంటే ముందు చాలా మందే ముఖ్యమంత్రులు అయ్యారు. అయినప్పటికీ మునుగోడు నీళ్ల గోస తీరలేదు. ఇదే నల్లగొండ జిల్లా బిడ్డ దుశ్చర్ల సత్యనారాయణ, తన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లోరైడ్ మీద పోరాటం చేశారు. ఈ క్రమంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి అనే వ్యక్తిని ఢిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధాని వాజిపేయి టేబుల్ మీద పెట్టి ‘అయ్యా ఇది మా బతుకు’ అని వేడుకున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. నల్గొండ ఫ్లోరైడ్ ఎగ్జిబిషన్ అయింది కానీ, సమస్య పరిష్కారం కాలేదు’’ అని కేసీఆర్ అన్నారు.

ఈ సమస్యను చూస్తూ తట్టుకోలేక తాను ఏడ్చానని చెప్పిన కేసీఆర్.. ఆ సందర్భంలో ఓ పాట రాశానని, కొన్ని వాక్యాలు చదివి వినిపంచారు. ‘‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ, ఎండిపోయిన బొక్కల మీద.. ఎగురుతున్నై జెండాలెన్నో, నల్లగొండకు నరకం జూపిన రాజకీయ గండాలెన్నో’’ అని ఆ పాటలోని కొన్ని వాక్యాల్ని సభికులకు వినిపించారు. ఒక్క నల్లగొండకే కాకుండా దేశానికే నరకం చూపించే జెండాలు మన మధ్యే తిరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

KCR: అక్కర్లేని ఉప ఎన్నిక ఇది, అయినా ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. మునుగోడు సభలో కేసీఆర్