10TV Global Footprints : భారత్ ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాల సత్తా.. ప్రగతి చక్రాలుగా మారిన సంస్థల కృషి..
10TV Global Footprints : దక్షిణ భారత దేశం నుంచి ప్రగతి చక్రాలుగా మారిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు.. దీటైన, అత్యద్భుత ప్రదర్శనతో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయ్.
10TV Global Footprints
10TV Global Footprints : భారతదేశ ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాల జోడీ డైనమిక్ గ్రోత్ ఇంజిన్లు లాంటిది. ప్రపంచ వాణిజ్య పటంలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంటే.. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అగ్రగామి పాత్ర పోషిస్తున్నాయ్. 2020లో 499.7 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న భారత ఎగుమతులు, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి రికార్డు స్థాయిలో 824.9 బిలియన్ డాలర్లకు చేరుకోవడం దేశ ఆర్థిక ప్రగతి జైత్రయాత్రకు నిలువెత్తు నిదర్శనం.
తయారీ రంగ విస్తరణ, సేవా రంగాల విశ్వరూపం, కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక సంస్కరణలు ఇండియాను గ్లోబల్ ట్రేడ్ హబ్‌గా నిలబెట్టాయ్. ఈ మహా ప్రస్థానంలో దక్షిణ భారత దేశం నుంచి ప్రగతి చక్రాలుగా మారిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు.. దీటైన, అత్యద్భుత ప్రదర్శనతో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయ్.

10TV Global Footprints
మేక్ ఇన్ ఇండియా’ సంకల్పం, ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్’ (PLI) విధానాలతో దేశీయ పరిశ్రమలు, స్టార్టప్‌లు సింహాల్లా జూలు విదిల్చి గర్జిస్తున్నాయ్. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, రక్షణ రంగం, టెలికాం పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఈ పథకాలు విప్లవాత్మకమైన మార్పుల్నే తెచ్చాయి. ఇవి కేవలం ఎగుమతులను పెంచడమే కాకుండా, లక్షలాది మందికి మెరుగైన ఉపాధి అవకాశాలను సృష్టించే కల్పతరువుల్లా మారాయి.
ఎగుమతి రాష్ట్రాలలో ధృవతార తెలంగాణ :
సేవా, తయారీ రంగాల జుగల్బందీ.. దేశ ఆర్థిక స్థితిని వేగంగా పరుగులు పెట్టిస్తోంది. భారతదేశ ఎగుమతుల ఇంజిన్‌గా ఐటీ , సేవా రంగాలు దూసుకుపోతుంటే.. మరోవైపు ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తువులు, ఔషధాల ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ముద్రను మరింత బలోపేతం చేస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఇండస్ట్రియల్ పార్కులు, అత్యాధునిక లాజిస్టిక్స్ వ్యవస్థలు దేశ ఎగుమతుల సామర్థ్యం..ఇవన్నీ ప్రగతికి ఊతమిస్తూ.. అంతకంతకూ రెట్టింపు అవుతున్నాయి.
భారతదేశ అగ్రగామి ఎగుమతి రాష్ట్రాలలో తెలంగాణ ధృవతారలా మెరుస్తోంది. ఈ నూతన రాష్ట్రం ఇప్పుడు ఆవిష్కరణల ఖిల్లా.. ఎగుమతుల నిల్లాగా మారింది. ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీలో తెలంగాణ అసాధారణ వృద్ధిని సాధించింది.
విశ్వనగరం హైదరాబాద్ నేడు గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా రూపాంతరం చెందింది. జీనోమ్ వ్యాలీ , హైటెక్ సిటీ .. ఇవి భాగ్యనగరానికి బిగ్ అడ్వాంటేజెస్. ప్రపంచ స్థాయి వైద్య పరిశోధనా సంస్థలు, డిఫెన్స్ క్లస్టర్లు హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. ఈ సానుకూల వాతావరణం విదేశీ పెట్టుబడులను అయస్కాంతంలా ఆకర్షిస్తూ ఎగుమతులలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
మరోవైపు నౌకాశ్రయాల ప్రగతి తీరంగా.. సహజ వనరుల మణిమకుట హారంగా వెలుగులీనుతోంది ఆంధ్రప్రదేశ్. విస్తారమైన సముద్ర తీరం, అపారమైన వనరులున్న ఏపీ.. సముద్ర ఆహార ఉత్పత్తులు, ఫార్మా, వ్యవసాయ ఆధారిత వస్తువులు, వస్త్ర పరిశ్రమ, గ్రానైట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎగుమతులలో రారాజుగా మారింది. ఈమధ్యకాలంలో ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ తయారీ రంగాల్లోనూ ఏపీ వేగంగా దూసుకెళ్తోంది. నౌకాశ్రయాల ఆధారంగా గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకుంటోంది.

10TV Global Footprints
విశాఖపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులు ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద వరాలు. ఈ వ్యూహాత్మక నౌకాశ్రయాలు అంతర్జాతీయ మార్కెట్లతో నేరుగా అనుసంధానమై, తక్కువ ఖర్చుతో కూడిన లాజిస్టిక్స్ రవాణాకు బాటలు వేశాయి. రాబోయే రోజుల్లో ఇరు రాష్ట్రాలలో రానున్న ఇండస్ట్రియల్ కారిడార్లు, అత్యాధునిక తయారీ క్లస్టర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ , అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులు ఎగుమతుల రంగాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లనున్నాయ్.
మొత్తంగా చూస్తే.. భారతదేశాన్ని గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యానికి తెలంగాణ సంప్రదాయ-సాంకేతిక మేధస్సు, ఆంధ్రప్రదేశ్ నౌకాశ్రయ-సహజ వనరుల శక్తి .. ఒక్కటై గ్రోత్ ఇంజిన్లుగా మారాయి. ఈ రెండు డైనమిక్ రాష్ట్రాల అజేయ ప్రయాణం.. భారత ఎగుమతుల దిగ్విజయకేతనంగా మారాయి.
