తెలంగాణకు తీవ్ర తుఫాను ముప్పు.. ‘మొంథా తుఫాన్’ ప్రభావంతో రెడ్ అలర్ట్ జిల్లాలివే!
తుఫాను తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బలహీనపడిన ‘మంతా’ తుఫాను ప్రస్తుతం తన దిశను మార్చుకుని నెమ్మదిగా తెలంగాణ వైపు కదులుతోంది. ఈ తుఫాను భద్రాచలానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, ఖమ్మంకు తూర్పున 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పై నుంచి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కొమరం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
