ఎంపీ డ్రైవర్‌కు రూ.150 కోట్ల భూమి గిఫ్ట్.. అసలు కథేంటి?
13 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌కు ఏకంగా రూ.150 కోట్ల విలువైన భూమి బహుమతిగా లభించడం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది!

Sandipanrao Bhumre
మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ సందీపన్ రావ్ భూమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ భూమ్రే వద్ద జావేద్ రసూల్ షేక్ అనే వ్యక్తి గత 13 ఏళ్లుగా కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల, నిజాం దివాన్ వారసులు సుమారు రూ.150 కోట్లు విలువ చేసే మూడు ఎకరాల భూమిని జావేద్ పేరిట గిఫ్ట్ డీడ్‌గా రాసిచ్చారు. ఎలాంటి రక్త సంబంధం లేని ఒక డ్రైవర్‌కు ఇంతటి విలువైన ఆస్తిని బహుమతిగా ఇవ్వడంపై అనుమానాలు మొదలయ్యాయి.
ఈ భూ బదిలీపై ముజాహిద్ ఖాన్ అనే న్యాయవాది ముంబై ఆర్థిక నేరాల విభాగానికి (EOW) ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దివాన్ వారసుల కుటుంబంతో తనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ అభిమానంతోనే వారు తనకు భూమిని బహుమతిగా ఇచ్చారని డ్రైవర్ జావేద్ పేర్కొన్నట్టు సమాచారం.
పోలీసులు తనను సంప్రదించింది నిజమేనని, అయితే ఈ భూమి బదిలీ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని వారికి స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే విలాస్ భూమ్రే తెలిపారు.