కరోనాతో చనిపోయిన వారి ఖననానికి నా కాలేజీ వాడుకోండి, విజయ్ కాంత్ పెద్ద మనసు

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 06:15 AM IST
కరోనాతో చనిపోయిన వారి ఖననానికి నా కాలేజీ వాడుకోండి, విజయ్ కాంత్ పెద్ద మనసు

Updated On : April 28, 2020 / 6:15 AM IST

కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి అన్ని రంగాల వారు తమ వంతు సాయం చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన వారు సైతం ఎవరికి తోచిన రీతిలో వారు హెల్ప్ చేస్తున్నారు. కొందరు విరాళం ఇస్తున్నారు. మరికొందరు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇంకొందరు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇలా తమకు చేతనైన సాయం చేస్తున్నారు. తమిళ సీనియర్ నటుడు విజయ్‌కాంత్‌ సైతం ఓ మంచి పని చేశారు. ఆయన చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా, కరోనాతో చనిపోయిన వారి ఖననం కోసం భూదానం చేశారు. 

తమిళ సీనియర్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ భూదానం చేశారు. ఇటీవల చెన్నైలో కరోనాతో ఓ న్యూరో సర్జన్‌ చనిపోయాడు. అతడికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్మశానానికి తీసుకెళ్లగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు అడ్డుతగిలారు. అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. అక్కడ ఆయనను ఖననం చేస్తే కరోనా వైరస్ తమకు సోకే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైద్యుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్‌పైనా దాడిచేశారు.

 

ఈ విషయం తెలిసి చలించిపోయిన విజయ్‌కాంత్‌.. చెన్నెలో ఉన్న తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు. తనకు చెందిన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని కొంత భాగాన్ని దానం చేశారాయన. కరోనా వ్యాధితో చనిపోయినవారిని ఖననం చేయడానికి ఆ చోటుని వాడుకోమని విజయ్ కోరారు. ‘‘మృతదేహాల నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదు. ఈ విషయంలో జనంలో ప్రభుత్వాలు అవగాహన తీసుకురావాలి’’ అని విజయ్‌కాంత్‌ విజ్ఞప్తి చేశారు.

విజయ్‌కాంత్‌ పెద్ద మనసుని అంతా మెచ్చుకున్నారు. ఆయన చేసిన పనిని ప్రశంసించారు. రియల్ హీరో అని కితాబిచ్చారు. జనసేనాని పవన్ సైతం విజయ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి స్థలం ఇస్తానని చెప్పిన ఆయన మంచి మనసును మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. 

 

”కరోనా వైరస్ తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేయడానికి స్థానికులు నిరాకరించారు. కానీ, డీఎండీకే నాయకుడు, సూపర్ స్టార్ విజయ్ కాంత్ తన కళాశాల భూమిలో కొంత భాగాన్ని కరోనా బాధితుల కోసం ఇవ్వడం నిజంగా అద్భుతమైన విషయం. ఆయనది ఎంతో గొప్ప వ్యక్తిత్వం అని” పవన్ ప్రశంసించారు.