కరోనావైరస్ గాల్లో ఎంతసేపు ఉంటుంది? ఎంతదూరం ప్రయాణించగలదు? కనిపెట్టే పనిలో హైదరాబాద్ సైంటిస్టుల స్టడీ

corona virus:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. గాల్లోనూ వ్యాపిస్తుందా? ఎంత సమయం గాల్లో వైరస్ ఉండగలదు? అలా ఎంతదూరం వ్యాపించగలదు? ఇలాంటి ఎన్నో సందేహాలకు సరైన సమాధానం వెతికే పనిలో పడ్డారు సైంటిస్టులు.. సాధారణంగా కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినా నోటి నుంచి వెలువడే వైరస్ కణాలు.. ఎంత దూరం వ్యాపించగలవో కనిపెట్టేందుకు హైదరాబాద్ సైంటిస్టులు అధ్యయనం ప్రారంభించారు.
CSIR-Centre Cellular, Molecular Biology (CCMB) ఈ అధ్యయనాన్ని లాంచ్ చేసింది. ప్రత్యేకించి ఆస్పత్రుల పరిసర ప్రాంతాల్లో సోకిన వ్యక్తి నుంచి కరోనా వైరస్ గాల్లో ఎంతసేపు ఉంటుంది అనేదానిపై పరిశోధన చేస్తున్నారు. హెల్త్ వర్కర్ల సేఫ్టీ దృష్ట్యా సైంటిస్టులు 10 రోజుల క్రితమే ఈ పరిశోధనను ప్రారంభించారు. వాస్తవానికి కరోనా వైరస్ గాల్లో ప్రయాణించగలదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. కానీ, వైరస్ ఎంత సమయం గాల్లో ఉంటుంది? ఎంతదూరం ప్రయాణించగలదు అనేదానిపై కచ్చితమైన ఆధారాలు లభించలేదు.
కరోనా బాధితులకు దగ్గరగా ఉండే హెల్త్ కేర్ సిబ్బందికి భద్రత కల్పించడానికి కరోనా ఎంతదూరం ప్రయాణించగలదో అంచనా వేయొచ్చునని CCMB డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. కరోనా వైరస్ గాల్లో ప్రయాణించగలదు అనడానికి ఏదైనా కచ్చితమైన ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు 200 మందికి పైగా సైంటిస్టులు ఒక లేఖ రాశారు.
రెండు నెలల తర్వాత హైదరాబాద్ సైంటిస్టులు దీనిపై అధ్యయనాన్ని ప్రారంభించారు. అధ్యయనంలో భాగంగా CCMB తర్వాత మూసిన హాల్స్, పబ్లిక్ ప్రాంతాలతో పాటు బ్యాంకులు, మాల్స్ వంటి ప్రదేశాల్లో కొన్ని శాంపిల్స్ తీసుకోనున్నట్టు మిశ్రా తెలిపారు. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ప్రదేశాల్లో వైరస్ సోకిన వ్యక్తి నుంచి కరోనా వైరస్ ఎంతదూరం వ్యాపించగలదు? ఎంత సమయం గాల్లో ఉండగలదో పరిశోధిస్తున్నామని మిశ్రా తెలిపారు. అధ్యయనం కింద ఆస్పత్రుల్లో కొన్ని శాంపిల్స్ తీసుకోనున్నామని చెప్పారు.
అలాగే ఐసీయూ లేదా కోవిడ్-19 వార్డ్ ప్రదేశాల్లో అది కూడా కరోనా పేషెంట్లకు రెండు నుంచి నాలుగు లేదా ఎనిమిది మీటర్ల దూరం వరకు ఆయా ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించనున్నట్టు మిశ్రా వెల్లడించారు. గాల్లో వైరస్ ఎన్ని గంటలు ఉండగలదు? అది అర్థగంటా లేదా 10 నిమిషాలు మాత్రమేనా? ఎంతదూరం ప్రయాణించగలదు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
సోకిన వ్యక్తి నుంచి బయటకు వచ్చిన కరోనా వైరస్‌కు గాల్లో ఎంతదూరంగా ఉంటే సురక్షితమే గుర్తించేందుకు ప్రధానంగా ఈ అధ్యయనాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ విషయంలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
ప్రాథమిక పరిశోధన ఫలితాల ఆధారంగా మరింత ప్రయోగాలను నిర్వహిస్తామని మిశ్రా స్పష్టం చేశారు. సాధారణంగా కరోనా వైరస్ గాల్లో రెండు లేదా మూడు మీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా వేస్తున్నామన్నారు. దీనిపై కచ్చితమైన ఆధారాలను గుర్తించిన తర్వాతే వెల్లడిస్తామని తెలిపారు.