ట్రెండ్ మారింది : జన్మపత్రాన్ని మర్చిపోండి.. జినోమ్‌ పత్రాన్ని నమ్ముకోండి

కాలం మారింది. పద్ధతులు మారుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కొన్ని విషయాల్లో మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 07:30 AM IST
ట్రెండ్ మారింది : జన్మపత్రాన్ని మర్చిపోండి.. జినోమ్‌ పత్రాన్ని నమ్ముకోండి

కాలం మారింది. పద్ధతులు మారుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కొన్ని విషయాల్లో మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు.

కాలం మారింది. పద్ధతులు మారుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కొన్ని విషయాల్లో మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు. పెళ్లి సమయంలో జాతకాలను నమ్మడం అందుకు నిదర్శనం. జీవితాంతం కలిసి బతకాల్సిన వారు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే జాతకాలు మ్యాచ్ కావాలని తల్లిదండ్రులు నమ్ముతారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట అంటోంది సైన్స్‌. కేవలం చూపులతో.. కాసిన్ని విచారణలతో వ్యక్తుల గుణగణాలపై ఒక నిర్ధారణకు రావడం సరికాదని హెచ్చరిస్తోంది. ఈ పాతకాలపు పద్ధతులైన జన్మపత్రాన్ని కాకుండా.. జినోమ్‌ పత్రాన్ని నమ్ముకోవడం మేలని అంటోంది. 

జన్యువుల్లో సమస్త సమాచారం:
మన ఒడ్డూ పొడవు మొదలుకొని.. మనకు రాగల జబ్బుల వరకూ అన్నింటి సమాచారం జన్యువుల్లో ఉంటుంది. ఈ జన్యువుల్లోని సమాచారాన్ని చదివేందుకు వీలు కల్పించేదే జినోమ్‌ పత్రి. డీఎన్‌ఏ పోగు అడినైన్, గ్వానైన్, థయామీన్, సైటోసైన్‌ అనే నాలుగు రసాయనాలతో ఏర్పడి ఉంటుంది. వీటిని నూక్లియోటైడ్‌ బేసెస్‌ అని పిలుస్తారు. ఈ బేసెస్‌ జంటలను బేస్‌ పెయిర్స్‌ అంటారు. ఇలాంటి 300 కోట్ల బేస్‌పెయిర్స్‌తో మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుంది డీఎన్‌ఏ. ఈ డీఎన్‌ఏ పోగులోని భాగాలే జన్యువులు. మనుషుల్లో వీటి సంఖ్య దాదాపు 25 వేలు. మన జీవక్రియలకు అవసరమైన అన్ని రకాల ప్రొటీన్లను ఇవే ఉత్పత్తి చేస్తుంటాయి. వారసత్వంతోపాటు, వాతావరణం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి అనేక కారణాలతో జన్యుక్రమంలో వచ్చే మార్పులు వ్యాధులకు దారితీస్తాయి అని సైన్స్‌ చెబుతోంది. ఆరోగ్య సమస్యలు లేని ఇద్దరు దంపతులైతే.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. కాలిఫోర్నియా, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన ప్రకారం 5–హెచ్‌టీటీఎల్‌పీఆర్‌ అనే జన్యువుల్లో తేడాలుంటే విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువని తేలింది. ఆ జన్యువులు మానసిక ఉద్వేగాలను ప్రభావితం చేస్తాయట.

జాతకాలు వద్దు:
జాతకాలను బట్టి పెళ్లిళ్లు చేసుకోవడం భారత్‌ లాంటి దేశాల్లో ఇంకా కొనసాగుతున్నప్పటికీ విదేశాల్లో మాత్రం ట్రెండ్‌ మారుతోంది. మనిషి జన్యుక్రమం నమోదు చేసే ఖర్చు గణనీయంగా తగ్గడం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు జన్యుక్రమ నమోదు ప్రక్రియకు కోట్ల రూపాయలు ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు లక్ష రూపాయల్లోపు మాత్రమే అవుతోంది. ఇదే సమయంలో జన్యువుల పనితీరు.. వ్యాధుల విషయంలో వీటి పాత్ర వంటి వాటిల్లో సైన్స్‌ కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో రెండు జన్యుక్రమాలను పోల్చి చూసి దంపతులైతే ఎలా ఉంటుందో చెప్పే ప్రత్యేక పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. విదేశాల్లో ఇలాంటి జెనిటిక్‌ మ్యాచింగ్‌ చేసిపెట్టే కంపెనీలు బోలెడున్నా.. మన దేశంలో మాత్రం చాలా తక్కువ.