కరోనా ఎఫెక్ట్.. ఇరాన్‌లో 85వేల మంది ఖైదీలకు విముక్తి!

ప్రపంచదేశాలను కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనాపై ప్రపంచ దేశాలు విస్తృత స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. కరోనా వైరస్ పుణ్యామని ఇరాన్ లో 85వేల మంది ఖైదీలకు తాత్కాలిక విముక్తి కలిగింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అదుపు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఖైదీలను కూడా విడుదల చేసినట్టు జ్యుడిషియరీ ప్రతినిధి ఘోల్మహుస్సేన్ ఇస్మైలీ వెల్లడించారు. భద్రత పరమైన కారణాల రీత్యా 50 మందిని విడుదల చేసినట్టు తెలిపారు.
జైలల్లో కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ఖైదీలతో సహా ఇతర ఖైదీలను కూడా విడుదల చేస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న జైల్లో నుంచి అందరూ రాజకీయ ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసినట్టు యూఎన్ స్పెషల్ ర్యాపర్టోయిర్ జావెద్ రెహ్మాన్ తెలిపారు. ఇప్పటివరకూ ఇరాన్ లో 853 మంది మృతిచెందగా, 14,991 మంది బాధితులు ఉన్నారు.
చైనా తర్వాత దాని బయటి దేశాల్లో ఇరాన్ కూడా కరోనా దెబ్బకు వణికిపోతోంది. వైరస్ ప్రభావంతో జైల్లలో నుంచి విడుదల చేసిన ఖైదీలను తిరిగి ఎప్పుడు జైల్లోకి తరలిస్తారు అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. మార్చి నెల ఆరంభంలో ఇరాన్ ఖైదీల్లో కొంతమందికి కరోనా వైరస్ సోకినట్టు రెహ్మాన్ వెల్లడించారు. చాలామంది ఇరానీయులను ఇంట్లోనే ఉండాలని అరోగ్య అధికారులు సూచిస్తున్నారు. కానీ, దేశంలోని పవిత్ర ఆలయాలు, మసీదులను కూడా మూసివేశారు.