మరణం అంటూ తప్పుడు వార్తనే ప్రచార అస్త్రంగా వాడుకున్న నటి.. దేశవ్యాప్తంగా అవగాహనకు బీజం

ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల.. ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగి.. ఎంతో మందికి అవగాహన కలుగుతోంది.

మరణం అంటూ తప్పుడు వార్తనే ప్రచార అస్త్రంగా వాడుకున్న నటి.. దేశవ్యాప్తంగా అవగాహనకు బీజం

Cervical Cancer

నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చే అమ్మకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిది. సృష్టికి మూలమైన ఆ తల్లికి… గర్భాశయమే ఇప్పుడు పెద్ద విపత్తు తెచ్చిపెడుతోంది. కేవలం అవగాహన లేమి కారణంగా గర్భాశయ క్యాన్సర్‌తో ఏటా 35వేల మంది అతివలు ప్రాణాలు కోల్పోతున్నారు. పుట్టినప్పటి నుంచి బిడ్డకు ప్రతి విషయం గురించి పూసగుచ్చి చెప్పే తల్లులకు.. ఈ సాధారణ క్యాన్సర్‌ గురించి అప్రమత్తం చేసే వారే కరువయ్యారు.

ఇలాంటి సమయంలో సర్వైకల్‌ క్యాన్సర్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు ఓ నటి. అందుకోసం తన మరణ వార్తనే ప్రచార అస్త్రంగా వాడుకున్నారామె. సరిగ్గా.. వరల్డ్‌ క్యాన్సర్‌ డేకు ఒకరోజు ముందు ఆమె చేసిన ప్రకటన.. దేశవ్యాప్తంగా ఒక అవగాహనకు బీజం వేసింది.

ఫిబ్రవరి 4న వరల్డ్‌ క్యానర్స్‌ డే
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. దానికి కారణం ఓ సినీ తార. సాధారణంగా వరల్డ్‌ క్యానర్స్‌ డే రోజు (ఫిబ్రవరి 4న) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ.. బాలీవుడ్‌ స్టార్‌ పూనమ్‌పాండే తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వైకల్‌ క్యాన్సర్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌ తర్వాత.. ఏటా కొన్ని వేలమంది పొట్టన పెట్టుకుంటోందీ సర్వైకల్‌ క్యాన్సర్‌. అలాంటి క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన వచ్చేందుకు తాను చనిపోయినట్లు ప్రకటించుకున్నారు పూనమ్‌ పాండే.

ఎస్‌.. మీరు విన్నది నిజమే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నామే బాలీవుడ్‌ బోల్డ్‌ స్టార్‌ పూనమ్‌ పాండే. 32 ఏళ్ల ఆమె సర్వైకల్‌ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు ఆమె మేనేజర్‌ శుక్రవారం ప్రకటించారు. ఆ వార్త ఇండస్ట్రీతోపాటు చాలా మందిని షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత చాలా మంది అభిమానులు, ప్రముఖులు ఆమెకు నివాళి సైతం ప్రకటించారు. కానీ.. శనివారం ఆనూహ్యంగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. తాను చనిపోలేదని.. బతికే ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు.

దేశంలో నానాటికీ ప్రమాదకరంగా మారిన సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు పూనమ్‌ పాండే. తాను గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోలేదని.. కానీ వేలాది మంది మాత్రం దీని వల్ల మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ముందస్తు గుర్తింపు లేదా వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ఈ క్యాన్సర్‌ బారి నుంచి కాపాడుకోవచ్చని పేర్కొన్నారామె.

సాధారణంగా మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు గురవుతూ ఉంటారు. ఆ తర్వాత మహిళలు ఎక్కువగా బాధపడేది సర్వైకల్‌ క్యాన్సర్‌ వల్లే. ప్రపంచ వ్యాప్తంగా మిగతా క్యాన్సర్లతో పోలిస్తే.. ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. కానీ.. మనదేశంలో మాత్రం మహిళల్లో వస్తున్న వాటిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ది రెండో స్థానం. కేవలం గత ఏడాది కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల 61 వేల 044 సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు బయటపడితే.. అందులో 3 లక్షల 48 వేల 186 మంది మృత్యువాత పడ్డారు.

లక్షల సంఖ్యలో బాధితులు
మన దేశంలో లక్షల సంఖ్యలో సర్వైకల్‌ క్యాన్సర్‌ బాధితులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవలే ప్రకటించింది. ఏటా దాదాపు 80 మంది గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడుతుండగా… అందులో 35 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో 3 లక్షల 42 వేల 333 మంది ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 45 వేల 682 మంది సర్వైకల్‌ క్యాన్సర్‌ బాధితులతో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం.. దేశంలో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌ 17 వేల 146 మందితో 7వ ప్లేస్‌లో ఉండగా… తెలంగాణ 11 వేల 525 మంది బాధితులతో 11వ స్థానంలో ఉంది.

మహిళల్లో గర్భాశయం దిగువ ఉన్న సర్విక్స్‌లో తలెత్తే క్యాన్సర్‌ను సర్వైకల్‌ క్యాన్సర్‌ అంటారు. సర్విక్స్‌లో కణాలు మార్పులు చెందుతూ క్యాన్సర్‌గా మారి.. పూర్తిగా విస్తరిస్తాయి. పాప్‌ స్మియర్‌, పెల్విక్‌ ఎగ్జామినేషన్‌, బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. ప్రీ క్యాన్సర్‌ దశలో చిన్నపాటి చికిత్సతోనూ దీన్ని నిర్మూలించే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 29 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి రెండుమూడేళ్లకోసారి ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 9 నుంచి 26 ఏళ్ల అమ్మాయిలకు ఈ వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్‌ వేస్తారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టీకా ధర మార్కెట్‌లో 2 వేల రూపాయలకు అందుబాటులో ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సర్వైకల్‌ క్యాన్సర్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉచితంగా చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు.

మొత్తంగా ఎంతోమంది ప్రాణాలకు పెనుముప్పుగా మారిన సర్వైకల్‌ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన తెచ్చేందుకు నటి పూనమ్‌ పాండే చేసిన సాహసంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల.. ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగి.. ఎంతో మందికి అవగాహన కలుగుతోంది.

Poonam Pandey : నేను బ్రతికే ఉన్నా..అందుకోసమే నేను చనిపోయినట్లు పోస్టు పెట్టా