ఆరోగ్యాల సిరులు బతుకమ్మ పూలు 

  • Published By: veegamteam ,Published On : September 28, 2019 / 04:11 AM IST
ఆరోగ్యాల సిరులు బతుకమ్మ పూలు 

బతుకమ్మ పండుగ అంటూ..ఆటలు..పాటలు..అందంగా ముస్తాబవ్వటమే కాదు. ఆరోగ్యాల పండుగ బతుకమ్మ వేడుక. ప్రకృతి మనిషి ఇచ్చే ఆరోగ్యాల పండుగ బతుకమ్మ వేడక. మనిషి ప్రకృతికి దగ్గరకెళ్లి..మొక్కల నుంచి ఒక్కొక్క పువ్వు కోసినప్పుడు మనకు ప్రకృతి ఇచ్చే ఆరోగ్యాల పండుగ బతుకమ్మ పండుగ. ప్రకృతి మనిషితో పెనువేసుకుపోయే వేడుక. ఆడబిడ్డలు పోటీలు పడి దొసిళ్ల కొద్దీ పూలు కోసుకుని..ఒడి నింపుకుని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ పూలలోను..మొక్కల్లోను ఉండే ఎన్నో ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా బతుకమ్మ పండుగకు వినియోగించే పూలన్నింటిలోను ఎన్నో ఔషధ గుణాలున్నాయని నిపుణులు సైతం చెబుతుంటారు. బతుకమ్మ పూలు అంటే ఆరోగ్యాలు పంచే సిరులు.  ఔషధాల గనులు. 

బతుకమ్మ పూలల్లో నలభై రకాల ఔషధ గుణాలున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. క్రిమిసంహారకాలుగా పనిచేసే రసాయనాలూ ఈ పూలలోని ఔషధ గుణాలలో ఉన్నాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. వర్షాల కాలం..వానలతో పాటు అనారోగ్యాలు తెచ్చే కాలం..సరిగ్గా ఈరోజుల్లోనే ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా..ప్రకృతి మనిషి ఇచ్చే ఔషధాలే ఈ బతుకమ్మ పూలు. 

తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి… వంటి పూలను కోసేటప్పుడు..పేర్చేటప్పుడు.. ఆ పూలు వి ఇంటిలో ఉండటం వల్లకూడా పరిసరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పూలలో యాంటీ బయోటిక్స్‌గా పనిచేసే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. గుమ్మడి ఆకులల్లో యాంటీ బయోటిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి.పూలు, ఆకులతో తయారుచేసిన బతుకమ్మలను చెరువుల్లో కలపటం వల్ల వాటిలో ఉండే సహజ సిద్ధమైన గుణాలతో నీటిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌ల లాంటివి నశించి పోతాయి. దాంతో చెరువులు, కుంటల్లో ఉండే నీళ్లు పరిశుభ్రంగా తయారవుతాయి. 

వర్షాకాలంలో చెరువులు, కుంటలు కొత్త నీటితో నిండిపోతాయి. కొత్త నీటిలో సూక్ష్మక్రిములు ఉంటాయి. ఈ నీటిని తాగితే వైరల్ ఫీవర్లతో పాటు కలరా, డయేరియా, న్యుమోనియా వంటి వ్యాధులు వస్తాయి. నేటి ఆధునిక కాలంలో ఈ వ్యాధుల్ని నివారించే ట్రీట్ మెంట్స్ వచ్చాయి. కానీ గతంలో ఇటువంటి వైద్యాలు అందుబాటులో ఉండేవి కాదు. ఇటువంటి వ్యాధులు వస్తే ప్రకృతి సహజమైన వైద్యాన్నే చేసేవారు. 

వర్షాకాలంలో కొత్తనీటితో పాటు వచ్చే కొత్త కొత్త అనారోగ్యాలనుంచి కాపాడుకునే పండుగే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ చేసుకోవటమే కాక..నీటిని కూడా పరిశుభ్రం చేసే పండుగ బతుకమ్మ పండుగ. సరిగ్గా వర్షాకాలం పూర్తయ్యే సమయంలోనే ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడం, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న పూలతో బతుకమ్మలను పేర్చి నీటిలో కలపడం సంప్రదాయంగా మారింది. బతుకమ్మకు వాడే తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల, పట్నంబంతి లాంటి పూలల్లో ఉండే ఔషధ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కనిపెట్టి..దాన్నే పండుగగా..సంప్రదాయంగా చేసుకునేలా చేసారు మని పెద్దలు..మరి బతుకమ్మ ఏఏ పూలలో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసుకుందాం..

తంగేడు పూలు : దీని శాస్త్రీయ నామ కాసియా ఆరిక్యులేటా:  కంటి ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో తంగేడు పూలు చాలా బాగా ఉపయోగపడతాయి. జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పుల నివారణలో తంగేడును వాడతారు. మలబద్ధకం, పచ్చ కామెర్లు, లివర్ జబ్బులు, మూత్ర కోశ వ్యాధులకు మెడిసిన్ గా తంగేడును వాడతారు. చర్మ సంబంధ సమస్యలకు విరుగుడుగా తంగేడు ఆకులను వాడతారు. కడుపులో పెరిగే నులిపురుగుల నివారణకు, రుమటాయిడ్ ఆర్థ్రైటీస్, గౌట్ నివారణలో కూడా తంగేడు ఆకులు చక్కటి మందుగా పనిచేస్తాయి.

గునుగు పూలు : గాయం అయిన చోట గునుగు పూలతో కట్టుకడితే ఇన్ఫెక్షన్లు రావు. ఏదైనా ప్రమాదంలో రక్తస్రావం అయితే గునుగు ఆకులను ముద్దగా చేసి..కడితే రక్తస్రావం నిలచిపోతుంది. గతంలో అతిసార, కలరావంటివి వర్షాకాలంలో వచ్చేవి. వీటిని నివారించుకునేందుకు గునుగు పూలను వాడేవారు. పాము కాటుకు గురైతే..ఆ  విషానికి విరుగుడుగా గునుగు పూలలోని ప్రతీ భాగం ఔషధంగా ఉపయోగపడుతుంది.  గునుగు మొక్క వేళ్లను గజ్జి. తామర లాంటి చర్మ సంబంధ సమస్యలకు పెట్టింది పేరుగా వాడతారు.ఆఫ్రికా దేశాల్లో గునుగు లేత పూలను సూపుల్లో వాడతారట.గునుగు గింజల నుంచి నూనె కూడా తయారుచేస్తారు.

బంతి : బంతిపూల నూనెలో యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా బంతి ఉపయోగపడుతుంది. కాస్మెటిక్స్ తయారీలో బంతిది ప్రత్యేక స్థానం ఉంది. 

కట్ల : క్యాన్సర్, డయాబెటిక్ నివారించే లక్షణాలు ఈ పూలల్లో పుష్కలంగా ఉన్నాయంటారు నిపుణులు. 

గుమ్మడి : గుమ్మడి అంటేనే రుచికి మారుపేరు. గుమ్మడి ఆకులు..పువ్వులు..పండు..గింజలు ఇలా గమ్మడి ఆరోగ్యాల మెండు. మధుమేహం, ట్యూమర్లను నివారిస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. గుమ్మడి పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కడుపులో నులిపురుగుల, మూత్ర సంబంధ సమస్యలకు గుమ్మడి అద్భుతమైన ఔషధం. ఔషధ గుణాలున్న గుమ్మడిని మనం కూరగా..వడియాలుగా..ఇలా గుమ్మడికి భారతీయులు చక్కగా..వాడుతుంటారు. 
బీర: బీర ఆకులు జాండీస్‌ అంటే కామెర్లకు మందుగా వాడతారు.బీర ఆకులే కాదు..పువ్వులు..కాయలు చక్కటి ఔషధాలుగా ఉపయోగపడతాయి. 

పట్నం బంతి : కండరాలు బిగదీసుకుపోకుండా నివారిస్తుంది. పట్నం బంతిపూలు గొంతు నొప్పిని తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి.