Eggs: మనం ప్రతిరోజు తినే గుడ్ల గురించి 5 అపోహలు.. నిజాలు

కోడిగుడ్ల గురించి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. ఏయే అపోహలు ఉన్నాయి? నిజానిజాలేంటో తెలుసుకుందామా?

Eggs: మనం ప్రతిరోజు తినే గుడ్ల గురించి 5 అపోహలు.. నిజాలు

Myths About Eggs

Eggs: ప్రతిరోజు కోడిగుడ్డు తింటే ఎన్నో ఆహార ప్రయోజనాలు ఉంటాయి. వైద్యులు ఇదే విషయాన్ని రోగులకు చెబుతుంటారు. అయితే, మనం తినే గుడ్ల గురించి చాలా కాలం నుంచి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. గుడ్లు శరీరానికి మంచివి కాదని భావించేవారు చాలా మంది ఉన్నారు.

కొన్ని రోగాలు రావద్దంటే గుడ్లకు దూరంగా ఉండాలని, వాటిని తినొద్దన్న అపోహ సమాజంలో ఉంది. నిజానికి గుడ్లలో ఉండే ప్రొటీన్, మంచి కొవ్వు, ముఖ్యమైన మినరల్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. గుడ్లపై చాలా కాలంగా సమాజంలో ఉన్న అపోహలు ఏంటీ? పరిశోధనలు, నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…

అపోహ: గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది కాదు

నిజం: ఆ అపోహ చాలా కాలంగా సమాజంలో ఉంది. గుడ్లలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడంతో చాలా మంది అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని అనుకుంటారు. అయితే, పలు పరిశోధనల్లో అది సరికాదని తేలింది. అసలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని ఆహార కొలెస్ట్రాల్ పెంచదు. అంతేగాక, గుడ్డులోని పచ్చసొన కొవ్వును నిరోధించి, తద్వారా ఎల్డీఎల్ (LDL), హెచ్డీఎల్ (HDL) కొలెస్ట్రాల్ స్థాయులనూ నియంత్రిస్తుంది.

అపోహ: ఉడకపెట్టిన గుడ్ల కంటే పచ్చి గుడ్లలో పోషకాలు ఎక్కువ

నిజం: ఉడకపెట్టిన గుడ్ల కంటే పచ్చి గుడ్లలో పోషకాలు ఎక్కువ ఉంటాయని చాలా మంది అనుకుంటారు. గుడ్లను ఉడకపెట్టకుండా తింటే మరింత ప్రొటీన్, బీ12, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరానికి అందుతాయని భావిస్తారు. అయితే, పచ్చి గుడ్లను అలాగే పగులకొట్టి నేరుగా తినడం కొంచెం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా (Salmonella) వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. ఫుడ్ పాయిజన్ అయ్యే ముప్పు ఉంటుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. గుడ్లను ఉడకబెడితే బ్యాక్టీరియా చనిపోతుంది.

అపోహ: పచ్చ సొనకంటే తెల్లసొనలో అధిక పోషకాలు

నిజం: గుడ్డులో పచ్చ సొనకంటే తెల్లసొనలో అధిక పోషకాలు ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. అలాగే, తెల్లసొనలో మాత్రమే పోషకాలు ఉంటాయని కూడా కొందరు అనుకుంటారు. పచ్చసొనలో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయని దాన్ని తినొద్దని భావిస్తారు. అయితే, పచ్చ సొనలో ఉండే కీలకమైన విటమిన్లు ఏ, డీ, ఈ, కే (vitamins A, D, E and K) తెల్లసొనలో ఉండవు. అంతేకాదు, పచ్చసొన ఆరోగ్యకరమైన కొవ్వును శరీరానికి అందిస్తుంది.

అపోహ: గుడ్లు తింటే మరింత బరువు పెరుగుతాం
నిజం: గుడ్లు తింటే బరువు పెరుగుతూనే ఉంటామని కొందరు భావిస్తుంటారు. అది సరికాదని పరిశోధనల్లో తేలింది. గుడ్లలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. దీంతో, గుడ్లు తింటే కడుపునిండిన భావన ఉంటుంది. ఇతర చిరుతిళ్ల వైపునకు మనసు మళ్లదు. మీ జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

అపోహ: తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగులో ఉండే గుడ్లే ఆరోగ్యకరం
నిజం: తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగులో ఉండే గుడ్లే ఆరోగ్యకరమని కొందరు అనుకుంటారు. అయితే, గుడ్ల రంగు వాటిలోని పోషక విలువలు, నాణ్యతపై ఎలాంటి ప్రభావం చూపదు.

Note: ఈ వివరాలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వాటిని పాటించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి.

Cow Urine: గోమూత్రం మనుషులకు హానికరం.. ఐవీఆర్ఐ పరిశోధనలో వెల్లడి